Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు డిస్కమ్ వద్దు.. అనుమతి ఇవ్వొద్దంటూ ఈఆర్సీకి రిక్వెస్టులు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ (TGRPDCL)’ అనే పేరుతో ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కమ్‌కు అనుమతి ఇవ్వవద్దంటూ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు విద్యుత్ శాఖ రిటైర్డ్ ఇంజినీర్లు, మాజీ ఉద్యోగులు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిసిటీ చట్టంలోని నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఈ డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నదని ఆ రిక్వెస్టులో పేర్కొన్నారు. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఇంజినీర్లు, మాజీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ మీటింగులో ఐదు తీర్మానాలు ఆమోదం పొందాయి. ఈ డిస్కమ్‌కు రెగ్యులరేటరీ అథారిటీ అనుమతి ఇస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు ప్రైవేటుపరం అవుతాయని, దేశంలోనే ఇది మొదటి నిర్ణయం అవుతుందన్న ఆందోళనను ఈ మీటింగ్ వ్యక్తం చేసింది. రైతు డిస్కం పేరుతో ఉనికిలోకి వస్తున్న ఈ కొత్త వ్యవస్థ అవసరమైన నిబంధనలు పాటించలేదని, లీగల్ చిక్కులు ఉన్నాయని పేర్కొన్నది.

టెక్నికల్‌గా, లీగల్‌గా అవసరమైన విధానాలను తుంగలో తొక్కి అనుమతి కోసం ఎలక్ట్రిసిటీ కమిషన్‌కు ప్రభుత్వం హడావిడిగా దరఖాస్తు చేసుకున్నదని రౌండ్ టేబుల్ మీటింగ్ ఆ రిక్వెస్టులో పేర్కొన్నది. తగినంత ఈక్విటీ (వాటా), అప్పులు తీసుకోడానికి ఉన్న మార్గాలు, బిజినెస్ ప్రణాళిక, తగినంత మంది సిబ్బంది లేకుండానే డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ప్రస్తావించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రస్తావించకుండానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఇప్పుడున్న రెండు డిస్కమ్‌ల నుంచి కొన్ని విద్యుత్ కనెక్షన్లను కొత్త డిస్కమ్‌కు (TGRPDCL) బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నదని గుర్తుచేసింది. విద్యుత్ కమిషన్‌ ఆమోదం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా లైసెన్సులో సవరణల కోసం పాత డిస్కమ్‌లు చివరి నిమిషంలో పబ్లిక్ నోటీసులు ఇస్తున్నాయని పేర్కొన్నది.

కొత్త డిస్కమ్‌కు అన్ని ప్రభుత్వ సర్వీసులను అప్పజెప్పడంతో పాత డిస్కంల ప్రైవేటీకరణ ఉద్దేశం స్పష్టమవుతున్నదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పనిచేస్తున్న రెండు డిస్కంలలోని అధికారులు, సిబ్బందిని పదోన్నతులు కల్పిస్తామనే ఆఫర్ తో కొత్త డిస్కమ్‌లోకి తీసుకెళ్ళే ప్రయత్నం జరుగతున్నదని, ఏండ్ల తరబడి ప్రమోషన్లు లేకుండా ఉన్న ఉద్యోగులకు భ్రమలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సర్వీసు నిబంధనలకు విరుద్ధమైనదని కమిషన్‌కు రౌండ్ టేబుల్ మీటింగ్ వివరించింది. కొత్త డిస్కమ్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని కోరింది. ఈ నెల 29న ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్న తరుణంలో ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ జరగడం, వెల్లడైన అభిప్రాయాలను తీర్మానం రూపంలో పంపడం గమనార్హం.

Read Also: రాష్ట్రానికి బిగ్ రిలీఫ్.. మెట్రో ఫస్ట్ ఫేజ్ అప్పులకు రుణం మంజూరు

Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>