కలం, వెబ్ డెస్క్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మ మహాజాతర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 20వ తేదీలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఖమ్మం పర్యటన అనంతరం మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, జిల్లా అధికారులతో కలిసి ఆయన మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతర ఏర్పాట్ల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న మేడారం (Medaram) మహాజాతర కోసం ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ముఖ్యంగా రాతి కట్టడాలతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, అంకుటిత దీక్షతో ఈ పనులను పూర్తి చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మహాత్కార్యంలో భాగస్వామిని కావడం ఆ అమ్మవార్ల దయ, తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్థానిక మంత్రి సీతక్క ప్రతిరోజూ పనులను పర్యవేక్షిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు.
భక్తుల సౌకర్యార్థం జాతర ప్రాంగణంలో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నారు. గిరిజన ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా ప్రాంగణ ఆధునీకరణ, ప్రధాన ఆర్చి నిర్మాణం, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలు, నిరంతర నీటి సరఫరా వంటి పనులు పూర్తయ్యాయి. మేడారానికి వచ్చే అన్ని రహదారులను విశాలంగా తీర్చిదిద్దడంతో పాటు సెంట్రల్ లైటింగ్, పచ్చదనం, ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించే సుందర శిల్పాలతో కూడళ్లను ఆధునీకరించారు. ఆధునీకరణ నేపథ్యంలో ఈసారి దేశం నలుమూలల నుంచి భక్తుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉన్నందున, ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ మహాజాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందని తెలిపారు.

Read Also: హరీశ్‌రావుకు కొత్త తలనొప్పి
Follow Us On: X(Twitter)


