కలం, మెదక్ : మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) పోలీసులు ఒక గంటలోనే సుమారు 9 తులాల బంగారం రికవరీ చేశారు. శుక్రవారం ఉదయం తమ బ్యాగ్ పోయిందని బాధితులు 100కు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగ్ లో 9 తులాల బంగారం ఉందని తెలిపారు. వెంటనే స్పందించిన తూప్రాన్ (Toopran) పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దీంట్లో ఫిర్యాదుదారుడు బైక్ పై వెళ్తుండగా బంగారం ఉన్న బ్యాగ్ కిందపడిపోయిందని తేలింది. పోలీసులు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి ఆ బ్యాగ్ ను తీసుకున్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లగా అతడు పోలీసులకు బ్యాగ్ అప్పగించాడు. స్వాధీనం చేసుకున్న బ్యాగులో సుమారు 9 తులాల బంగారు చైన్లు ఉన్నాయి. వీటిని పోలీసులు యజమానికి అందజేశారు. బంగారం రికవరీలో వేగంగా స్పందించిన సీఐ రంగాకృష్ణ, ఎస్సై గంగరాజు నేతృత్వంలోని పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అలాగే, బంగారాన్ని నిజాయితీగా పోలీసులకు అందజేసిన నాగరాజు, కృష్ణలను శాలువాలతో సన్మానించారు.

