కలం, వెబ్‌డెస్క్: ఒకటీ రెండూ కాదు ఏకంగా పదకొండేళ్ల నుంచి ఒకే తరగతిలోనే కొనసాగుతున్నాడా విద్యార్థి (Mbbs student). ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న బీఆర్డీ మెడికల్ కాలేజీలో బయటపడింది. ఇటీవల ఆ కాలేజీకి కొత్త ప్రిన్సిపాల్ వచ్చారు. ఆయనకు హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘనకార్యం బయటికి వచ్చింది. ఇన్నేళ్లుగా ఫస్టియర్‌లోనే కొనసాగుతున్న ఆ విద్యార్థి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక సదరు ప్రిన్సిపాల్ ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి మొరపెట్టుకున్నారు.
అసలు విషయం ఏంటంటే..
సదరు విద్యార్థి (Mbbs student) సొంతూరు ఆజాంగఢ్. తండ్రి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎంబీబీఎస్ చదవడం కోసం నిర్వహించే సీపీఎంటీ పరీక్షలో బొటాబొటీ మార్కులతో పాసైన ఆ విద్యార్థి.. 2014లో రిజర్వు కేటగిరీ కింద బీఆర్డీ కాలేజీలో చేరాడు. అనంతరం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడు. అయితే, మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. విచిత్రమేంటంటే ఆ తర్వాత అతను మళ్లీ సప్లిమెంటరీ కాదు కదా ఏ పరీక్ష కూడా రాయలేదు. అటెండెన్స్ మాత్రం ఉంది. అంతేకాదు, హాస్టల్ వదిలిపెట్టి వెళ్లకుండా, అందులోనే ఉండిపోయాడు. అలా ఏకంగా పదొండేళ్లు పరీక్షలు రాయకుండా, పాసవకుండా గడిపేశాడు.
విద్యార్థి తీరుతో విసుగుచెందిన హాస్టల్ వార్డెన్ నాలుగు సార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన ఎలాంటి చర్యా తీసుకోలేదు. ప్రస్తుతం కొత్త ప్రిన్సిపాల్ రావడంతో వార్డెన్ మళ్లీ ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆరుగురు హెచ్వోడీలు, హాస్టల్ వార్డెన్‌తో మీటింగ్ ఏర్పాటుచేసిన ప్రిన్సిపాల్.. విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడారు. చివరికి ఆ విద్యార్థికి మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఆ స్టూడెంట్ శ్రద్ధగా చదివి, పాసవకపోతే ఏం చేయాలి? అనే అనుమానం రావడంతో ఎన్ఎంసీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
ఎన్ఎంసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పాత నిబంధనల) ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి నిర్ణీత గడువు లేదు. ఎన్నేళ్లలో అయినా కోర్సు పూర్తి చేయొచ్చు. అయితే, నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) 2023లో తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి ఎంబీబీఎస్ ఫస్టియర్‌ను నాలుగు అటెంప్ట్ల్లోగా పూర్తిచేయాలి. అలాగే మొత్తం కోర్సును తొమ్మిదేళ్ల లోపు పూర్తిచేయాలి. ఈ విద్యార్థి పాత నిబంధనలు అమలులో ఉన్న కాలంలో కాలేజీలో చేరినందువల్ల అతనిపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నది ఎన్ఎంసీ నిర్ణయించాలి.
ఇదే మొదటిది కాదు..
ఎంబీబీఎస్ విద్యార్థులు ఏళ్ల తరబడి కోర్సు పూర్తి చేయకపోవడం ఇదే మొదటిసారి కాదు. కోర్సు పూర్తికి 10–12 ఏళ్లు సమయం తీసుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒకరైతే ఏకంగా 22 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఇదే ఇప్పటివరకు రికార్డు. అయితే, ఫస్ట్ ఇయర్లోనే 11 ఏళ్లు గడిపిన రికార్డు మాత్రం ప్రస్తుతం గోరఖ్‌పూర్ బీఆర్ఆడీ కాలేజీ విద్యార్థిదే.
Read Also: ‘నరేగా బచావో’ పై సీతక్క దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్.. షెడ్యూల్ ఫిక్స్
Follow Us On : WhatsApp


