Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్.. ‘గోల్డ్ థీఫ్’ సుబోధ్ సింగ్ అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్ భారీ దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు భారీ విజయం సాధించారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ‘గోల్డ్ థీఫ్’.. బిహార్ పూర్ణియా జైలు నుంచే గ్యాంగ్‌ను ఆపరేట్ చేస్తున్న ముఠా నాయకుడు సుబోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు తమ అదుపులోకి తీసుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, హైడ్రామా నడుమ బిహార్ నుంచి నిందితుడిని కరీంనగర్ తరలించారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం నేతృత్వంలోని ప్రత్యేక బృందం వ్యూహాత్మకంగా నిఘా నీడలో కరీంనగర్ తరలించిన అనంతరం నిందితుడిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి జుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ భారీ దోపిడీ గుట్టును విప్పేందుకు సుబోధ్ సింగ్‌ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కట్టుదిట్టమైన భద్రత – పోలీసుల మైండ్ గేమ్

బిహార్ జైలు నుంచి సుబోధ్ సింగ్‌ను తరలించే ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపింది. పూర్ణియా జైలులో శిక్ష అనుభవిస్తున్న సుబోధ్ సింగ్‌ను గురువారం రాత్రి పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా తరలించారు. రోడ్డు మార్గంలో వాహనాల్లో తరలిస్తారన్న ప్రచారంతో.. అతడి గ్యాంగ్ పోలీసులపై ఎటాక్ చేసి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన కరీంనగర్ పోలీసులు చివరి నిమిషంలో తమ రూట్ మ్యాప్ మార్చారు. నిందితుడి ముఠా ఎత్తులను చిత్తు చేస్తూ నేరుగా ఫ్లైట్‌లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి కరీంనగర్ వరకు భారీ కాన్వాయ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య రోడ్డు మార్గంలో తరలించారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతనికి జుడీషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

జైలు నుంచే నెట్‌వర్క్.. పోలీసుల టెక్నాలజీ వేట

గతంలో ఏ రాష్ట్ర పోలీసులు కూడా సుబోధ్ సింగ్‌ను తాకలేకపోయారు. కోర్టులో బలమైన సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడటమే ఇందుకు కారణం. తాను జైలులోనే ఉన్నాడు కాబట్టి ఈ నేరాలతో తనకు సంబంధం లేదంటూ సుబోధ్ సింగ్ ఇన్నాళ్లూ ధీమాగా ఉన్నాడు. అయితే కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఈ నెట్‌వర్క్‌పై సునిశితంగా స్టడీ చేశారు. జైలు నుంచే స్కెచ్ వేసి, ప్రత్యేక యాప్స్ ద్వారా తన టీమ్‌కు డైరెక్షన్స్ ఇచ్చినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం సుబోధ్ సింగ్ వాడిన ప్రత్యేక అప్లికేషన్లు, వాటి ద్వారా చేసిన చాటింగ్, వీడియోలు, ఫోటో షేరింగ్ డేటాను రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. టెక్నాలజీ సహాయంతో పాటు.. ఇంటరాగేషన్ ఎక్స్‌పర్ట్స్ (ప్రశ్నించడంలో నిపుణులు) రంగంలోకి దించి సుబోధ్ సింగ్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? దొంగిలించిన బంగారం ఎక్కడికి తరలించారు? అనే పూర్తి వివరాలు త్వరలోనే తేలనున్నాయి. జైలు గోడల మధ్య కూర్చొని దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ఆట కట్టించారు కరీంనగర్ పోలీసులు. కోర్టు కస్టడీ అనుమతి లభిస్తే ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కార్పోరేట్ స్టైల్ దోపీడీ?

నేర సామ్రాజ్యంలో సరికొత్త పంథా… దోపిడీ చేయాలన్నా నైపుణ్యం ఉండాలి…. దొంగతనాల్లో ఆరితేరిన వారికే అక్కడ గుర్తింపు…. కరీంనగర్ పీఎన్జే జ్యువెలరీ షోరూంలో జరిగిన భారీ దోపిడీ కేసును ఛేదిస్తున్న పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి… ఆ గ్యాంగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఆ గ్యాంగ్ పనితీరు ఎలా ఉంటుంది? .. పోలీసులకే మైండ్ బ్లాక్ అయిన విషయాలు వెలుగులోకి రావడం .. అందుకు సిపి గౌష్ ఆలం మీడియా సమక్షంగా చెప్పడం ఇంకా ఆత`తంగానే ఉంది. కరీంనగర్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన “సుబోధ్ సింగ్” గ్యాంగ్ వివరాలు వింటే షాక్ అవ్వాల్సిందేనని తెలుస్తోంది. ఇదొక అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని పోలీసులు ద`వీకరించారు. వీరి గ్యాంగ్‌లోకి ఎంట్రీ దొరకాలంటే ఒకే ఒక అర్హత ఉండాలి.. అది “క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్”. నేరాల్లో ఎంతగా ఆరితేరితే అంత త్వరగా ఈ గ్యాంగ్‌లో చోటు దక్కుతుందట. సాధారణ కంపెనీల తరహాలోనే ఈ గ్యాంగ్ సభ్యులకు ప్రతినెల రూ. 20 వేల వేతనం అందుతుంది.

ఒకవేళ వీరు రెక్కీ నిర్వహించి దోపిడీని సక్సెస్ చేస్తే.. ఏకంగా రూ. 5 లక్షల గుడ్ విల్ (బోనస్) లభిస్తుంది. కేవలం దోపిడీ చేసే వారికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు నేరుగా డబ్బు అందేలా ఒక ప్రత్యేక నెట్ వర్క్ కూడా పనిచేస్తుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దోపిడీలు జరుగుతున్నాయి? ఎవరు దొరుకుతున్నారు? అనే విషయాలను జైలు నుంచే పర్యవేక్షిస్తాడు. జైల్లోనే నేరస్థులను కలిసి, తన అంచనాలకు తగ్గట్టుగా ఉండేవారిని ఎంపిక చేసుకుంటాడు. ఆ తర్వాత వారితో టచ్‌లోకి వెళ్లి దోపిడీకి కావాల్సిన పూర్తి ప్లాన్‌ను (స్కెచ్) అందజేస్తాడు. ప్రాథమిక విచారణ ప్రకారం సుబోధ్ సింగ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 400 క్వింటాళ్ల బంగారాన్ని దోచుకున్నట్లు తెలుస్తోంది. దోచుకున్న బంగారాన్ని మళ్ళీ ముఠా సభ్యులు జైల్లో ఉన్నప్పుడో లేదా అవసరమైనప్పుడో ఆభరణాలపై రుణాలు ఇచ్చే సంస్థల్లో తాకట్టు పెట్టి నిధులను సమకూర్చుకుంటారు.

బంగారం రికవరీ అయ్యేనా?

మే 3వ తేదీన కరీంనగర్ జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల జైళ్లలోని డేటాను సేకరించి, ముఠాలోని ఒక సభ్యుడిని గుర్తించడంతో కీలక అడుగు పడింది. దోపిడీలో పాల్గొన్న ఐదుగురు ఇతర రాష్ట్రాల వారేనని, ఆఫ్‌లైన్ మ్యాప్స్ సహకారంతోనే వీరు తప్పించుకున్నారని పోలీసులు నిర్ధారించారు. ముగ్గురి నిందితులను పట్టుకున్నా కీలకమైన పది మందిని పట్టుకోలేదు. కార్పొరేట్ స్థాయిలో నెట్ వర్క్ నడుపుతున్న ఈ సుబోధ్ సింగ్ గ్యాంగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి, సుమారు రూ. 82,02,000 విలువైన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లారు.

ఈ క్రమంలో ప్రతిఘటించిన నలుగురు సిబ్బందిపై కాల్పులు జరిపి గాయపరిచారు. బంగారం మాత్రం రికవరీ కాలేదు. దొరికిన వారికి రివార్డు లక్ష రూపాయలు రివార్డు ప్రకటించారు కానీ దొంగల వద్ద రూ.51 వేలు మాత్రమే దొరికాయి.. దీని ద్వారా ఈ మెసేజ్ పోలీసులు ఎలా సూచిస్తారో తెలియడం లేదు. బంగారం దొరికేనా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కరుడు కట్టిన దొంగలు కొంతమంది దొరకడమే చాలా కష్టమైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. అదంతా సీరియస్ విషయం అయినప్పటికీ పలు రాష్ట్రాల నుంచి పకడ్బందీగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.

మూడు నెలలుగా రెక్కీ..

సాంకేతిక నిఘా ఆధారంగా ప్రత్యేక బృందం వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, బీహార్‌కు చెందిన రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్, సిమ్ కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ ఖాన్ ఉన్నారు. జగీరా సింగ్‌పై 7 కేసులు, రావిష్ కుమార్‌పై 15 కేసులు వివిధ రాష్ట్రాల్లో నమోదై ఉన్నాయి. ఈ కేసులో ఇంకా 10 మంది నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్, “ది గోల్డెన్ థీఫ్”గా పేరొందిన సుభోద్ సింగ్ ఈ దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేశాడు. అతని ఆదేశాల మేరకు రఘునాథ్ కర్మాకర్ బృందం రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చి ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్‌లలో రెక్కీ నిర్వహించింది.

పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద నకిలీ సిమ్ కార్డులు కొనుగోలు చేసి, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో బస చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపంలో తుపాకులు సేకరించి దోపిడీకి పాల్పడ్డారు. అంతరాష్ట్ర గ్యాంగ్ లీడర్ సుబోధ్‌సింగ్ సూచనల ప్రకారం.. ఈ నెల 2న తెల్లవారుజామున వెస్ట్ బెంగాల్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు రఘునాథ్‌కు తుపాకులు అందించారు. ఆ తుపాకులను రఘునాథ్ ఒక ఆటోలో కరీంనగర్ వైపు పంపించగా, అతనికి తెలియకుండానే తుపాకులు ఇచ్చిన ముఠా ఆ ఆటోను జన్నారం వరకు అనుసరించింది. ఈ కారు కదలికలన్నీ స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారంగా మారింది. ప్రస్తుతం ఆ వెస్ట్ బెంగాల్ కారు ఎక్కడ ఉందనే కోణంలోనూ గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: ప్రధాని మోదీపై విద్యార్థులకు నమ్మకం లేదు: రాహుల్ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>