Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుడ్ న్యూస్

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ అభివృద్ధి పనుల కోసం జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్‌కు ఈ నిధుల వరద పారింది. జనాభా అవసరాలు, భౌగోళిక విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వం ఈ కేటాయింపులు జరపడంతో స్థానిక సంస్థల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం నగర కార్పొరేషన్‌కు సింహభాగం​

ఈ నిధుల కేటాయింపుల్లో ఖమ్మం నగర కార్పొరేషన్‌కు సింహభాగం దక్కింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య సవాలు, జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అత్యధికంగా రూ. 95 లక్షల నిధులను విడుదల చేసింది. అయితే జిల్లాలోనే పాత మున్సిపాలిటీ అయిన ఇల్లందు, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడేనికి పెద్దపీట వేయడం గమనార్హం. కొత్తగూడెం మున్సిపాలిటీకి రూ. 79 లక్షలు, ఇల్లందు మున్సిపాలిటీకి రూ. 77 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

మధిరకు 27.20 లక్షలు

మరోవైపు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల అవసరాలను సైతం ప్రభుత్వం సమూలంగా పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా మధిర మున్సిపాలిటీకి రూ. 27.20 లక్షలు, మణుగూరు మున్సిపాలిటీకి రూ. 20.05 లక్షలు, సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ. 18 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. అలాగే జిల్లాలోనే చిన్న మున్సిపాలిటీగా ఉన్న వైరాకు రూ. 10 లక్షల నిధులను విడుదల చేశారు. ​స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిబంధనల ప్రకారం ఈ నిధులను పట్టణాలను “చెత్త రహిత నగరాలు”గా మార్చేందుకు వినియోగించనున్నారు.

చెత్త సేకరణకు ప్రాధాన్యం

తడి, పొడి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోల కొనుగోలు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల బలోపేతం వంటి ఘన వ్యర్థాల నిర్వహణ పనులకు ఈ నిధులు ఊతమివ్వనున్నాయి. వీటితో పాటు మురుగునీరు, మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల నిర్వహణ, పట్టణాల్లోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లలో రన్నింగ్ వాటర్ సదుపాయాన్ని మెరుగుపరచడం వంటి పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు.​ వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ నిధులను సద్వినియోగం చేసుకుని డ్రైనేజీల పూడికతీత, చెత్త తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తే పట్టణాల్లో సీజనల్ వ్యాధుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపాలిటీలు ముందంజలో నిలిచేందుకు ఈ నిధులు ఎంతో దోహదపడనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఈ నిధులను పారదర్శకంగా ఖర్చు చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>