కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్‌జెండర్ల రాకను నిషేధం విధించడంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందించి సమస్యకు పరిష్కారం చూపారు. కలెక్టరేట్‌లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి ట్రాన్స్‌జెండర్లు, వివిధ గ్రామాల సర్పంచులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాల్లో ట్రాన్స్ జెండర్లు గ్రామాల్లోకి వచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సర్పంచులు వాపోయారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు..
ట్రాన్స్ జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని సర్పంచులు కలెక్టర్ ఇలా త్రిపాఠికి వివరించారు. అందుకే వారిని నిషేధించామన్నారు. దీనిపై ట్రాన్సెజెండర్లు స్పందిస్తూ.. ఈ బహిష్కరణ నిర్ణయాలతో తాము గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, జీవనోపాధి కోల్పోయామని కలెక్టర్‌కు వివరించారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు ఊళ్లల్లోకి వస్తుంటే.. తమపై ఆంక్షలు విధించడం భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ.. ఇక నుంచి అర్హత కలిగిన వాస్తవ ట్రాన్స్ జెండర్లకు జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఒక్కసారి ఐడీలు ఇచ్చాక, నకిలీ వారిని సులభంగా గుర్తించవచ్చన్నారు.
‘ఇచ్చింది తీసుకోవాలి తప్ప..’
ట్రాన్స్‌జెండర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇష్టపూర్వకంగా ఇచ్చినది తీసుకోవాలని హితవు పలికారు. సమాజంలో అనేక మంది ట్రాన్స్‌జెండర్లను శివసత్తులుగా కొలుస్తూ, తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. ఇకపై ఎక్కడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు. దీనికి ట్రాన్స్‌జెండర్లు అంగీకరిస్తూ, ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాల్లో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి, ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రామ సర్పంచులు అంగీకారం ప్రకటించారు. ఈ సమావేశంలో డీపీవో శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, డిడబ్ల్యూఓ పద్మ, ఏవో రాజబాబు, డీఎల్పీఓలు, ట్రాన్స్ జెండర్లు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

