కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించిన ఈ సభకు కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అమలులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసిందని కొనియాడారు. జూన్ 12న నిర్వహించనున్న ముగింపు ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన…
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని 65 డివిజన్లలో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, శాఖల సమన్వయంతోనే ఈ ప్రణాళిక విజయవంతమైందని తెలిపారు.
ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాల్స్..
సమావేశ ప్రారంభానికి ముందు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ, అభివృద్ధి ప్రదర్శన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పరిశీలించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, వివిధ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు “సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇల్లెందు మున్సిపల్ ఛైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, ఆర్డీవో మధు, జిల్లా అధికారులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

