కలం, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ఇక నుంచి తక్కువ వాడుకోవాలని చెప్పడంతో పాటు ప్రధాని మోదీ (PM Modi) చేసిన మరికొన్ని పొదుపు హెచ్చరికలతో మార్కెట్లు వణికిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ.16 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అయిపోయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95కి చేరిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఒక డాలర్ వంద రూపాయిలకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదా..?
త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే చమురు కంపెనీలపై తీవ్ర భారం నెలకొన్న నేపథ్యంలో.. పెంచడం మినహా మరో గత్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇక, బంగారం ఏడాది పాటు కొనొద్దని చెప్పడంతో ఆ రంగంపై కూడా ప్రభావం పడుతోంది. అసలు బంగారం కొనాలా.. వద్దా.. అనే పెద్ద ప్రశ్న కొనుగోలుదారుల్లో తలెత్తుతోంది. త్వరలోనే బంగారం దిగుమతులపై మరింత సుంకాలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే, ఇక బంగారం సామాన్యుడు ముట్టుకోలేని స్థాయికి వెళ్లిపోతుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం తప్పదనే చర్చ ఆర్థిక నిపుణుల్లో జరుగుతోంది.

