కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సోషల్ మీడియా వేదికగా ఇరాన్ పై విరుచుకుపడ్డారు. ఇరాన్ సైనిక శక్తి బలంగా ఉందంటూ వార్తలు ప్రసారం చేసే మీడియా సంస్థల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ సైన్యం బాగా పనిచేస్తోందని చెప్పడం అక్షరాలా దేశద్రోహమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అసత్య ప్రచారాలు శత్రువులకు అనవసరమైన ఆశలు కల్పిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారు మూర్ఖులని ట్రంప్ మండిపడ్డారు.
ఇరాన్ నావికాదళానికి సంబంధించి గతంలో ఉన్న 159 యుద్ధ నౌకలు ఇప్పుడు సముద్ర గర్భంలోనే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ కు నావికాదళం కానీ, వైమానిక దళం కానీ లేవని స్పష్టం చేశారు. వారి సాంకేతికత అంతమైందని, కీలక నేతలు కనుమరుగయ్యారని వివరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆయన విశ్లేషించారు. అమెరికాకు వ్యతిరేకంగా వాదించే వారు కేవలం మూర్ఖులు, కృతజ్ఞత లేని వారు మాత్రమేనని ట్రంప్ తన పోస్ట్ లో ఘాటుగా స్పందించారు.

