ఆ జిల్లాలో వెలవెలబోతున్న గ్రంథాలయాలు

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజ్ఞాన భాండాగారాలు వెలవెలబోతున్నాయి. ప్రజా చైతన్యానికి మారుపేరైన నల్లగొండ గడ్డపై గ్రంథాలయాల  (Libraries Nalgonda) ఉనికి ప్రమాదంలో పడింది. ఖజానాలో రూ.కోట్ల సెస్ నిధులు మూలుగుతున్నా.. కనీసం కరెంటు బిల్లులు కట్టలేని, దినపత్రికలు కొనలేని దయనీయ స్థితిలో గ్రంథాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజల నుంచి వసూలైన పన్నులు ప్రభుత్వ ఖాతాలో ఉన్నా.. ఆర్థిక శాఖ అనుమతుల కొర్రీలతో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని స్తంభన నెలకొంది. నిరుద్యోగులకు దిక్సూచిగా నిలవాల్సిన ఈ కేంద్రాలు, సిబ్బంది లేక మూతపడే దిశగా పయనిస్తుండటం జిల్లా విద్యా ముఖచిత్రంపై నీలినీడలు పరుస్తోంది. అస్తవ్యస్త నిబంధనలు ఒకవైపు.. మూడు దశాబ్దాలుగా భర్తీకి నోచుకోని ఉద్యోగ ఖాళీలు మరోవైపు వెరసి.. పాఠకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

​నిధులున్నా.. నిబంధనల సంకెళ్లు

​స్థానిక సంస్థలు (పంచాయతీలు, మున్సిపాలిటీలు) వసూలు చేసే ఆస్తి పన్నులో 8 శాతం ‘గ్రంథాలయ సెస్’ రూపంలో అందుతుంది. గత మూడేళ్లుగా కోట్లాది రూపాయల సెస్ వసూలవుతున్నప్పటికీ వాటిని వినియోగించుకోవాలంటే ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అనే నిబంధన అడ్డంకిగా మారింది. దీనివల్ల కనీసం విద్యుత్ బిల్లులు, దినపత్రికల బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. గత మూడు దశాబ్దాలుగా గ్రంథాలయాల్లో కొత్త నియామకాలు లేవు. ఉన్న ఉద్యోగులు ఒక్కొక్కరుగా పదవీ విరమణ పొందుతుండటంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఇదిలావుంటే.. నల్లగొండ జిల్లాలో 2021-22 నుంచి ఇప్పటివరకు దాదాపు 60 శాతం సెస్ వసూలయ్యింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.7.45 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.2.49 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక సూర్యాపేట జిల్లాలో రూ.5 కోట్లకు పైగా రావాల్సి ఉండగా, కేవలం రూ.2.68 కోట్లు మాత్రమే వచ్చాయి. యాదాద్రి జిల్లాలో రూ.1.50 కోట్లకు రూ.70 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

నల్లగొండ జిల్లాలో 33 గ్రంథాలయాలు ఉండగా, అందులో 43 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 13 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సూర్యాపేట జిల్లాలో 18 గ్రంథాలయాలు ఉండగా, 27 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. 23 ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో 15 గ్రంథాలయాలు ఉండగా, 23 మంది ఉద్యోగులు ఉండాల్సిన చోట కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 18 పోస్టులు ఖాళీగా బోసిపోతున్నాయి. వచ్చే మూడు నెలల్లో మరికొంతమంది రిటైర్ కానుండటంతో పరిస్థితి మరింత తీవ్రం కానుంది. సెక్యూరిటీ, స్వీపర్ల వంటి పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు అందక పోవడంతో కొన్ని గ్రంథాలయాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు గ్రంథాలయాల్లో పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం కొత్త పుస్తకాలు అందుబాటులోకి తేవాలని పాఠకులు కోరుతున్నారు. ఈ సమస్యపై గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ స్పందిస్తూ.. నిధుల వినియోగానికి అనుమతి కోరుతూ ఆర్థిక శాఖకు లేఖ రాశామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>