ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత అమెరికా మరోసారి అణ్వాయుధ పరీక్షలు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్ వంటి దేశాలు తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కానీ, వీటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అమెరికా మాత్రం ఎప్పుడూ బహిరంగంగానే వ్యవహరిస్తుంది. మేం దాచిపెట్టం. ఇన్నాళ్లూ మేము ఇతర దేశాల జోలికి వెళ్లలేదు. కానీ, ఇక పరిస్థితులు మారాయి. ఇప్పుడు మేమూ అణు పరీక్షలు ప్రారంభిస్తాం’’ అని స్పష్టంచేశారు.
ట్రంప్(Donald Trump) అమెరికా అణ్వస్త్ర శక్తిపై మాట్లాడుతూ.. ‘రష్యా(Russia), చైనా(China) వద్ద చాలా అణ్వాయుధాలు ఉన్నా, మావద్ద వాటికంటే ఎక్కువగా ఉన్నాయి. శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. మా దేశానికి ఉన్న అణు శక్తితో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయగలం. అయినప్పటికీ, మేము శాంతి కోరుకుంటున్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో అణ్వాయుధాలు వాడొద్దనే విషయంపై చర్చించాను. ఆ చర్చలు ఇంకా ఫలప్రదం కాలేదు. అందుకే ఇప్పుడు మేము ముందడుగు వేస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు ఇచ్చాను
ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా రక్షణ విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)కు ఇప్పటికే అణు పరీక్షల కోసం సన్నాహాలు ప్రారంభించమని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే, ఆ పరీక్షలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతాయన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. నెవాడా ఎడారిలో పాత అణు పరీక్షా కేంద్రాలను పునరుద్ధరిస్తున్నారని అమెరికా రక్షణ వర్గాలు సంకేతాలిచ్చాయి.
ఇటీవల చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ ఇప్పుడు అదే దేశానికి అణు అంశంలో హెచ్చరికలు జారీ చేయడం విశేషం. ‘‘రష్యా, చైనా రెండూ వేగంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. వారిని నిలువరించకపోతే భవిష్యత్తులో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. అమెరికా కూడా ఇక మౌనం పాటించదు’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్ట్ కూడా పెద్ద చర్చకు దారితీసింది. ‘‘అణ్వాయుధాల విధ్వంసకర శక్తిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఆ పరీక్షలను ఆపేశాను. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. రష్యా, చైనా వేగంగా అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. కాబట్టి అమెరికా కూడా వెనుకబడకూడదు’’ అని ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన
ట్రంప్ నిర్ణయం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. నిపుణుల అంచనా ప్రకారం, అమెరికా నిజంగా అణ్వాయుధ(Nuclear Weapons) పరీక్షలు ప్రారంభిస్తే, అది ప్రపంచ వ్యాప్తంగా కొత్త అణు పోటీకి నాంది కావచ్చు. రష్యా, చైనా, ఉత్తరకొరియా(North Korea) కూడా ప్రతిస్పందనగా తమ సొంత పరీక్షలను మరింత వేగవంతం చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
జాగ్రత్తగా గమనిస్తున్న భారత్
ఈ పరిణామాలను భారత్ కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. ఆసియా ప్రాంతంలో భద్రతా సమీకరణాలపై అమెరికా అణు పరీక్షలు ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ను ట్రంప్ స్పష్టంగా ప్రస్తావించడం వల్ల భారత్‌లో కూడా చర్చ మొదలైంది. ఇంటర్వ్యూ ముగింపులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి నిజమైన నాయకత్వం చూపించేది అమెరికానే. మా చర్యలు రక్షణాత్మకమైనవి. ఎవరి మీదా దాడి చేయాలన్న ఉద్దేశం లేదు. కానీ, మన దేశ భద్రత విషయంలో మేము ఎప్పుడూ రాజీ పడం’’ అని పేర్కొన్నారు.
మొత్తానికి, మూడు దశాబ్దాల తర్వాత అమెరికా మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతుందన్న ఈ ప్రకటనతో ప్రపంచదేశాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అమెరికా చివరిసారి నెవాడా టెస్ట్ సైట్లో 1992లో అణు పేలుడు సంభవించిన తరువాత అణు పరీక్షలు చేయడం ఆపేసింది. అయితే తాజాగా ట్రంప్ రష్యా, చైనా వంటి దేశాలను బూచిగా చూపిస్తూ అణుపరీక్షలు చేస్తామని ప్రకటించడం గమనార్హం.
Read Also: చేవెళ్ల ప్రమాదంలో హృదయవిదారకం.. తల్లి ఒడిలోని 15 నెలల పసికందు మృతి
Follow Us On : Instagram

