కలం, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ (Operation Kagar) డెడ్ లైన్ ముగుస్తున్న వేళ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి (Maoist Ganapathi) అనారోగ్యంతో ఉన్నట్లు తమకు సమాచారం అందుతున్నదని, ఆయనకు మెరుగైన వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని డీజీపీ వ్యాఖ్యానించారు. పోలీసులకు ఆయన లొంగిపోతే హైదరాబాద్‌లోనే ప్రభుత్వమే అవసరమైన వైద్య చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆయుధాలను వదలాలి.. జన జీవన స్రవంతిలోకి రావాలి.. కుటుంబాలకు దగ్గర కావాలి.. అని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపుతో రెండేండ్ల వ్యవధిలో మొత్తం 721 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారని గుర్తుచేశారు. లొంగిపోయినవారిలో వివిధ స్థాయిల్లోని లీడర్లు, కేడర్ ఉన్నారని అన్నారు. వందలాది ఆయుధాలు సైతం ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. ప్రభుత్వాలకు లొంగకుండా మావోయిస్టు పార్టీలో ఇంకా కొంతమంది ఉన్నారని తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఉన్నారని వివరించారు.
నేటితో ఆపరేషన్ కగార్ కంప్లీట్ :
కేంద్ర ప్రభుత్వం రూపొందించుకున్న షెడ్యూలు ప్రకారం మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ మార్చి 31న ముగుస్తున్నది. దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ప్రధాని మోడీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆ గడువు ప్రకారం మరొక్క రోజులో ఆపరేషన్ కగార్ ముగుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండేండ్ల వ్యవధిలో దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి (Maoist Ganapathi) సహా రాష్ట్రానికి చెందిన పసునూరి నరహరి, సికింద్రాబాద్‌కు చెందిన వార్త శేఖర్, హైదరాబాద్‌కు చెందిన నక్కా సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇడ్మల్ తదితరులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కిందిస్థాయి కేడర్‌తో కలుపుకుంటే తెలంగాణకు చెందినవారు ఇంకా 38 మంది అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసుల రికార్డుల ద్వారా తెలుస్తున్నది.
Read Also: సన్న బియ్యం పథకానికి ఏడాది.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ లంచ్
Follow Us On: X(Twitter)

