కలం, వనపర్తి: సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రతలో వనపర్తి (Wanaparthy) జిల్లా పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా–సైబర్ నేర రహిత తెలంగాణ’ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సైబర్ విభాగం సెక్యూర్డ్ ప్రొఫైలింగ్‌లో ప్రథమ స్థానం సాధించింది.
సైబర్ నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ప్రజలకు డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం తదితర అంశాల్లో విభాగం చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్పీ సునీతా రెడ్డి చేతుల మీదుగా సైబర్ ఎస్సై రవిప్రకాష్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
అప్రమత్తతే రక్షణ..
డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కొత్త రూపాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత కీలకమని ఎస్పీ సునీతా రెడ్డి పేర్కొన్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌కాల్స్, సందేశాలు, నకిలీ యాప్‌లు, ఆన్లైన్ పెట్టుబడులు, సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమన్నారు.

