కలం, వెబ్ డెస్క్ : సుదీర్ఘకాలంగా సంచలనం రేపుతున్న ప్రచారానికి తెరపడింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, జార్ఖండ్‌కు చెందిన ఆయన భార్య లొంగుబాటు (Narahari Surrender)పై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు బలం చేకూరుస్తూ వారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అందుతోంది. అతనితో పాటు మరో నలుగురు కీలక మావోయిస్టులు కూడా జనజీవనంలోకి వచ్చారు. ఈ కీలక పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ ఈరోజు మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ఈ లొంగుబాటుతో మావోయిస్టు సెంట్రల్ కమిటీ దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మరణించగా, మెజారిటీ నాయకులు లొంగిపోయారు. ప్రస్తుతం నరహరి లొంగుబాటుతో కేంద్ర కమిటీలో మిగిలింది కేవలం ఇద్దరు నేతలు మాత్రమే. వారిలో వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపించిన అత్యంత కీలక నాయకుడు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గణపతి లొంగుబాటుపై సందిగ్ధం కొనసాగుతున్నప్పటికీ, ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల పెద్దగా యాక్టివ్‌గా లేరని సమాచారం. దీనివల్ల నరహరి లొంగుబాటు తర్వాత ఇక మైదానంలో యాక్టివ్‌గా ఉన్న ఏకైక సెంట్రల్ కమిటీ నేతగా వార్త శేఖర్ మాత్రమే మిగిలారు. ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారుతోంది.

