epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మణుగూరు బస్టాండ్ కు మోక్షం ఎప్పుడో?

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు (Manuguru) మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి ‘దీపం ఉన్నా చీకటే’ అన్నట్లుగా తయారైంది. 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బస్టాండ్​ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి, ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగపడకుండా పోయింది. ఎదురుగానే బస్ డిపో ఉన్నప్పటికీ, ప్రయాణికులు మాత్రం ఎండకు ఎండి, వానకు తడుస్తూ రోడ్ల మీద బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.

శిథిలావస్థలో భవనం.. విశ్రాంతి గదులుగా మార్పు

మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బస్టాండ్ ప్రస్తుతం ప్రయాణికుల కోసం కాకుండా, కేవలం సిబ్బంది విశ్రాంతి గదులుగా మాత్రమే పరిమితమైంది. ఇక్కడ బస్సులు ఆగకపోవడంతో ప్రజలు ప్రైవేట్ బస్టాండ్ ఆశ్రయించడమో లేదా ప్రధాన రహదారిపై వేచి ఉండటమో చేస్తున్నారు. సుమారు 75 బస్సుల సామర్థ్యం ఉన్న డిపో అందుబాటులో ఉన్నా, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్ ఉంది కానీ.. మణుగూరు (Manuguru) పేరు లేదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 209.44 కోట్ల భారీ వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు 39 ప్రాంతాల్లో కొత్త డిపోలు, బస్టాండ్ల ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, ఆ జాబితాలో మణుగూరు   పేరు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మణుగూరు డిపోను సందర్శించినా, బస్టాండ్ పునరుద్ధరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఇక్కడి ప్రజలను నిరాశకు గురిచేసింది.

రాజకీయ హామీలు.. మారుతున్న ప్రభుత్వాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ. 5 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఐదు మండలాలకు కేంద్రంగా ఉండి, నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మణుగూరుకు సొంత బస్టాండ్ లేకపోవడం విచారకరం.

అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం.. చిగురిస్తున్న ఆశలు

తాజాగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు (Manuguru) బస్టాండ్ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించారు. బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయిందని, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతోనైనా ప్రభుత్వం స్పందించి, మణుగూరు ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తుందేమోనని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also: పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం : మంత్రి పొంగులేటి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>