కలం, వెబ్ డెస్క్ : కర్ణాటకలో (Karnataka) ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మద్దతుదారుడైన ఇక్బాల్ హుస్సేన్ మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘జనవరి 6 లేదా 9 తేదీల్లో డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 200 శాతం ధీమాతో చెబుతున్నా’ అని పేర్కొన్నారు. ఇది తాను స్వయంగా చెప్పడం కాదని వర్షాలు, విషాదాలను సరిగ్గా అంచనా వేసే సాధువుల నుంచి విన్న సమాచారం ఆధారంగా ఇలా చెబుతున్నానని వివరించారు.
ఈ నెల ప్రారంభంలో కూడా ఇదే తేదీలను ప్రకటించిన ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain) ‘ఇప్పుడు కూడా నా వాదనలో దృఢంగా ఉన్నాను. ఏమీ మారలేదు’ అని స్పష్టం చేశారు. హైకమాండ్ ఆమోదం గురించి ప్రశ్నించగా, ‘మా నాయకుడు ఒప్పందం ఉందని చెప్పారు కదా! ఒప్పందం లేకుండా ఆయన అలా అనేవారు కాదు’ అని ఆయన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ పోటీ మరింత తీవ్రమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ (DK Shivakumar) మధ్య ‘పవర్ షేరింగ్’ ఒప్పందం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ ఊహాగానాలు బలపడ్డాయి.
ఈ ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) డిసెంబర్ 19న శాసనసభలో ‘నేను పూర్తి పదవీకాలం కొనసాగుతాను. హైకమాండ్ నాకే మద్దతిస్తోంది’ అని స్పష్టం చేశారు. అయితే శివకుమార్ వైపు నుంచి ‘మేం ఇద్దరం హైకమాండ్‌తో కలిసి ఒప్పందం చేసుకున్నాం. దాన్ని పాటిస్తాం’ అని ప్రతిస్పందించారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికారిక నిర్ణయం రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి జనవరి మొదటి వారంలో ఏం జరుగుతుందో చూడాలి.
Read Also: ప్రియాంక గాంధీ మెచ్చిన కోడలు.. ఎవరీ అవివా బేగ్?
Follow Us On: X(Twitter)


