కలం, ఖమ్మం బ్యూరో : పేదలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేందుకు ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, పిల్లలకు మంచి విద్య అందించాలనే లక్ష్యంతో గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు పొంగులేటి వివరించారు
ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకుంటుందని పొంగులేటి చెప్పారు. రాబోయే రోజుల్లో వంద శాతం సిమెంట్ రోడ్లను నిర్మిస్తామని, దాంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తామని హామినిచ్చారు. శాశ్వత తాగునీటి తో సహా స్థానికంగా కావలసిన మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రైతును రాజు చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే రుణమాఫీ చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలో నాలుగున్నర లక్షలు ఇండ్లు మంజూరు చేసిందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తూ, ప్రతి సోమవారం నాడు లబ్ధిదారులు కట్టిన ఇంటి లెవెల్ ఆధారంగా చెల్లింపులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో పాలేరు నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేసి తెలంగాణలో రోల్ మోడల్ గా చేస్తానని హామినిచ్చారు. ఈ సందర్భంగా Ponguleti Srinivas Reddy పోలేపల్లిలో 56 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.


