కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) అభ్యర్థుల సహనానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఓసారి నిర్వహించిన పరీక్షను తీవ్ర నిర్లక్ష్యంతో రద్దు చేసిన ఎన్టీఏ.. జూన్ 21న మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అడ్మిట్ కార్డులను వెబ్ సైట్‌లో పెట్టినట్లు ప్రకటించింది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే లింక్ ఓపెన్ కావడం లేదు. రీఫ్రెష్ చేస్తున్నా ఎర్రర్.. అని చూపిస్తుండటంతో అభ్యర్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో లింక్ అందుబాటులోకి తెచ్చినా అదీ పనిచేయకపోవడంతో మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఫీజు రీఫండ్ చేసుకోవడానికి వెళుతున్న వారికి చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు వివరాలు నమోదు చేద్దామని ప్రయత్నిస్తే.. అసలు పాత వివరాలే కనిపించకపోవడంతో గందరగోళం నెలకొంది. అటు అడ్మిట్ కార్డుల లింక్ ఓపెన్ కాకపోవడం, ఇటు ఫీజు రీఫండ్ లేకపోవడంతో.. ఎన్టీఏపై విరుచుకపడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో నాటకాలు ఆడుతోందని తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.

