కలం, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj) ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్‌లకు న్యాయం చేసేందుకే పోక్సో చట్టం రూపొందించారని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియలో అధికారం, హోదా లేదా పలుకుబడి అడ్డురాకూడదని గుర్తు చేశారు. రాజ్యాంగం, చట్టం ముందు బాలికలందరికీ సమాన న్యాయం అందాలని, నిందితులు ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదని మనోజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మైనర్లకు సంబంధించిన కేసులో అత్యంత పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని, దర్యాప్తులో జాప్యం జరిగితే వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ నాయకుల గురించి కాదని, నిజం బయటకు రావాలని, న్యాయం గెలవాలని కోరారు. విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, నిష్పక్షపాతంగా చేపట్టాలని కోరారు. ఈ పోస్టులో తెలంగాణ సీఎం కార్యాలయం, డీజీపీలను ట్యాగ్ చేశారు. కాగా, మనోజ్ చేసిన పోస్టును ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi)కూడా రీపోస్ట్ చేశారు. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ పోక్సో కేసుపై ఇద్దరు సినీ నటులు స్పందించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

