కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ (Teach For Change) పేరుతో ఓ సంస్థను స్థాపించి విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించి పేద విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు దేవేంద్ర విద్యాలయ డైరెక్టర్ విజయేందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై చర్చ
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో టీచ్ ఫర్ చేంజ్‌ను సంస్థ సేవలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. యంగ్ ఇండియా కార్యక్రమం SC, ST, BC మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమగ్ర విద్యా వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఏమిటీ టీచ్ ఫర్ చేంజ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న సేవలను మంచు లక్ష్మీ (Manchu Lakshmi).. సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) వివరించారు. పఠనాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ లెర్నింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు వంటి అంశాలలో సంస్థ చేస్తున్న కృషిని వెల్లడించారు. సమగ్ర పాఠశాలల మోడల్‌కు విధానపరమైన సూచనలు, ప్రణాళిక రూపకల్పన అమలు దశల్లో సహకరించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అభివృద్ధి చేసిన వినూత్న కార్యక్రమాలను యంగ్ ఇండియా కార్యక్రమంలో సమీకరించే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా డిజిటల్ క్లాస్‌రూమ్స్, వలంటీర్ ఎంగేజ్‌మెంట్, ఉపాధ్యాయుల శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యం గురించి చర్చించారు. తెలంగాణలో ప్రతి చిన్నారికి సమాన విద్యా అవకాశాలు కల్పించి, వారు అభివృద్ధి చెందేందుకు దోహదపడాలనే సంయుక్త లక్ష్యానికి ఇది దారి తీస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: మన ఆడబిడ్డకు అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజకీయాల్లో హన్మకొండ మహిళ
Follow Us On: Instagram

