కలం, వెబ్ డెస్క్: మాంచెస్టర్ సిటీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చెల్సీతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ (Josko Gvardiol) కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడి కాలు విరిగిందని క్లబ్ అధికారికంగా వెల్లడించింది. ఈ వారంలో అతడికి శస్త్రచికిత్స కూడా జరగనుందని, గాయ తీవ్రతపై వైద్యులు పూర్తి అంచనా వేస్తున్నారని క్లబ్ తెలిపింది.
అదే మ్యాచ్‌లో రుబెన్ డయాస్ కూడా గాయంతో మైదానం విడిచాడు. ఇప్పటికే జాన్ స్టోన్స్ నెల రోజులుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. రయాన్ ఐట్ నూరీ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ కోసం అల్జీరియా జట్టుతో ఉన్నాడు. దీంతో మాంచెస్టర్ సిటీ క్లబ్ డిఫెన్స్‌కు తిప్పలు తప్పేలా లేవు. బ్రైటన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు సవిన్యో, ఆస్కార్ బాబ్, మటేయో కోవాచిచ్, ఒమర్ మార్మౌష్ కూడా అందుబాటులో ఉండరు.
ఈ కష్టకాలంలో అభిమానులకు కొంత ఊరట కలిగించిన విషయం రోడ్రి తిరిగి మైదానంలోకి రావడం. అక్టోబర్ తర్వాత తొలిసారి పూర్తి మ్యాచ్ ఆడిన అతడు భావోద్వేగంగా స్పందించాడు. “ఇంత కాలం బాధాకరంగా గడిచింది. మళ్లీ ఆడే అవకాశం రావడం నాకు దేవుడిచ్చిన వరం లాంటిది. ప్రతి నిమిషం మైదానంలో ఉండటం ఆనందంగా ఉంది” అని అన్నాడు. గాయాల బెడదతో ప్రీమియర్ లీగ్ రేస్‌లో మాంచెస్టర్ సిటీకి ఇది అత్యంత కఠిన దశగా మారింది. అభిమానులు మాత్రం జట్టు త్వరగా కోలుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: Sharechat


