కలం వెబ్ డెస్క్ : ట్రాఫిక్ (Traffic).. ప్రతి రోజూ దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. దీని నుంచి తప్పించుకోవడం కోసమే చాలామంది చాలా మార్గాలు వెతుక్కుంటుంటారు. కానీ ఈ ట్రాఫిక్ కష్టాలు మాత్రం అనేక మందికి తప్పవు. ప్రతి రోజూ తప్పించుకోలేని యుద్ధంలా ఉంటుంది. అయితే ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) తయారు చేసిన కొత్త ఆవిష్కరణతో ఈ సమస్యకు బైబై చెప్పొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది.
పట్టణ ప్రయాణం అంటే ట్రాఫిక్ జామ్‌లు ఆలస్యం అనే భావన త్వరలోనే మారబోతోంది. ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరించిన ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ (Air Taxi Prototype) ఈ మార్పుకు తొలి అడుగుగా నిలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది క్యాంపస్‌లో ప్రదర్శించిన ఈ నమూనా నగరాల్లో తక్కువ సమయంలో సురక్షిత ప్రయాణం సాధ్యమనే ఆశను కల్పిస్తోంది. ముఖ్యంగా అవయవ మార్పిడి అవసరమైన సందర్భాలు అత్యవసర వైద్య సేవల కోసం ఇది ప్రాణాలను కాపాడే సాధనంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఎయిర్ ట్యాక్సీ కాన్సెప్ట్ భారత్‌ను అధునాతన ఎయిర్ మొబిలిటీ యుగం వైపు నడిపిస్తోంది. ఎలక్ట్రిక్ ఆధారిత వెర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ వాహనాలు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుంచి నిమిషాల వరకూ తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ సేవలు అత్యవసర వైద్య బృందాల రవాణా మందులు అవయవాల వేగవంతమైన సరఫరా నగరాల మధ్య కీలక కనెక్టివిటీ ప్రీమియం పట్టణ విమాన ప్రయాణాల రంగాల్లో కీలకంగా మారనున్నాయి.
ప్రోటోటైప్ సిద్ధమైనప్పటికీ వాణిజ్య సేవలకు ముందు డీజీసీఏ అనుమతులు తప్పనిసరి. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్ బృందం భద్రతా పరీక్షలు పూర్తి చేసే దిశగా పని చేస్తోంది. ముందున్న దశల్లో విమాన భద్రతా విశ్లేషణ బ్యాటరీ పనితీరు పరీక్షలు ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థతో అనుసంధానం అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలు వంటి అంశాలపై విస్తృత పరిశీలన జరగనుంది. అన్ని దశలు విజయవంతంగా పూర్తైతే 2026 లేదా 2027 నాటికి తొలి వాణిజ్య సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు మేధోబలం ఐఐటీ హైదరాబాద్‌లోని TiHAN ఇన్నోవేషన్ హబ్ నుంచి వస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ నావిగేషన్, కృత్రిమ మేధ (AI) ఆధారిత కంట్రోల్, అడ్డంకుల గుర్తింపు, రియల్ టైమ్ రూట్ సజెషన్ వంటి ఆధునిక టెక్నాలజీలు ఈ ఎయిర్ ట్యాక్సీకి ప్రాణంగా మారుతున్నాయి. ఇవే రేపటి పైలట్ అవసరం లేని ఎయిర్ వాహనాలకు పునాదిగా నిలవనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు లగ్జరీ ప్రయాణాల కోసమే కాదన్న విషయాన్ని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇది సామాజిక బాధ్యతతో కూడిన ఆవిష్కరణగా మారనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకూ వైద్య అత్యవసరాల్లో వేగవంతమైన సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశమని, ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, దూర ప్రాంతాలకు వైద్య సేవలను దగ్గర చేయడం వంటి సందర్భాల్లో ఇది కీలక పాత్ర పోషించనుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక్కడ వేగమే ప్రాణాలను కాపాడే శక్తిగా మారనుందని వివరిస్తున్నారు.
ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్‌తో ఐఐటీ హైదరాబాద్ భారతదేశాన్ని పట్టణ విమాన రవాణా యుగంలోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ప్రభుత్వ విధానాలు విద్యా సంస్థల ఆవిష్కరణలు ఒకే దారిలో సాగితే త్వరలో మన ఆకాశంలో విమానాలతో పాటు స్మార్ట్ ఎయిర్ ట్యాక్సీలు కూడా కనిపించబోతున్నాయి. ఇది కేవలం సాంకేతిక విప్లవం కాదు మన ప్రయాణాలపై కొత్త ఆశలను నింపే మార్పు అని పరిశోధకులు అంటున్నారు.

Read Also: తొలిసారి తెలుగులో ఛార్జ్‌షీట్.. దుండిగల్ హెడ్‌కానిస్టేబుల్ వినూత్న ప్రయత్నం
Follow Us On : WhatsApp


