కలం, ఖమ్మం బ్యూరో : మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేసిన కేసులో ఓ మృగాడికి 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా పాల్వంచ హమాలీ కాలనీకి చెందిన ఆకుల చిన్నక్క కూతురు మానసిక వికలాంగురాలు. తల్లి కూలికి వెళ్లిన సమయంలో బాధితురాలు ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఇదే అదునుగా భావించిన ఓ కామాంధుడు ఆమెపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కూతురు నీరసంగా వుండటం, పొత్తి కడుపు పెరగడం గమనించిన తల్లి, బంధువులు బాధితురాలిని వెంటపెట్టుకొని ప్రతి ఇల్లు తిరిగి అడిగి తెలుసుకున్నారు. అదే కాలనీకి చెందిన పూనెం ప్రభాకర్‌పై అనుమానం వచ్చి గట్టిగా అడగడంతో తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. కాగా అప్పటి సీఐ టీ.సత్యనారాయణ కేసు నమోదు చేసి 14 మంది సాక్షులను విచారించి సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సరిత పూనెం ప్రభాకర్‌ను దోషిగా నిర్ధారించి వివిధ సెక్షన్ల కింద 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.


