రోహింగ్యాల ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం కీలక ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి సర్ (SIR) ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ (BJP) అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోహింగ్యాలు ఎక్కువగానే ఉన్నందున తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఎక్కకుండా అలర్ట్‌గా ఉండాలని బీజేపీ ఎంపీలకు హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఒక స్థానిక కార్యకర్తను నియమించుకుని అర్హత లేనివారు ఓటర్ల జాబితాలోకి ఎక్కకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేయనున్నది. రోహింగ్యాల విషయంలో లోతైన అవగాహన ఉండేలా బీజేపీ ఎంపీలందరినీ ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఉండాల్సిందిగా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళారు. హైకమాండ్ ఏం చెప్తుందోననే ఉత్కంఠ బీజేపీ రాష్ట్ర ఎంపీల్లో నెలకొన్నది.

ప్రతీ బూత్‌కు ఒక బీజేపీ ఏజెంట్ :

అర్హత లేనివారు ఓటర్ల జాబితాలో ఉండకూడదని, ఆ లక్ష్యంతోనే కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరుతో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లలో సర్ జరిగిన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అర్హత లేని ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి. భారత పౌరులుకానివారికి ఓటు వేసే అర్హత ఉండకూడదన్న నిబంధనతో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోకూడదన్నది బీజేపీ ఉద్దేశం. ఇలాంటివారిని గుర్తించేందుకు ప్రతీ పోలింగ్ బూత్‌కు ఒకరి చొప్పున పార్టీ ఏజెంట్‌ను నియమించాలని నిర్ణయించింది. సర్ ప్రక్రియ ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగే సమయంలో ఎలక్షన్ స్టాఫ్‌తో పార్టీ ఏజెంట్ తప్పనిసరిగా ఉండి ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా గమనించాలని హైకమాండ్ తెలంగాణ బీజేపీ (BJP) ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>