కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran) దాడులతో ఇటీవల కొన్ని రోజుల పాటు మూతపడ్డ దుబాయ్ ఎయిర్ పోర్ట్ (Dubai Airport) మళ్లీ మూతపడింది. దుబాయ్‌లో ఇరాన్ దాడులు తీవ్రమయ్యాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌ను మూసేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. మళ్లీ విమానాల రాకపోకలు ఎప్పటికి పునరుద్ధరిస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు.
దుబాయ్ ఎయిర్ పోర్ట్‌పై క్షిపణి దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దుబాయ్ ప్రభుత్వం ఖండించింది. గగనతలంలో ఇరాన్ డ్రోన్‌ను పేల్చివేసినప్పుడు కొన్ని శిథిలాలు పడ్డాయని వెల్లడించింది. ఈ ఘటనతో ఏర్పడ్డ పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పాక్షికంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. కన్ఫామ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.
దుబాయ్‌లో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ విమానాలు రీషెడ్యూల్ అవ్వడం, రద్దవడం జరుగుతూనే ఉంది. విమానయాన సంస్థల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌కు ఎవరూ రావొద్దని ప్రభుత్వం ప్రయాణికులకు సూచించింది. ఫ్లైట్ ట్రాకర్‌లో దుబాయ్ ఎయిర్ పోర్ట్ చుట్టూ విమానాలు చక్కర్లు కొడుతున్నట్లు చూపిస్తోంది. ల్యాండింగ్, టేకాఫ్‌లో విమానాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

