కలం, నిజామాబాద్ బ్యూరో : అందరి భాగస్వామ్యంతో నిజామాబాద్ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నగరంలో 2కే రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్ జెండా ఊపి ప్రారంభించారు.
కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్డీఓ కార్యాలయం వరకు 2కే రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో, సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్ విజయ్ కాంత్ రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

