కలం, వెబ్ డెస్క్: గత 12 ఏళ్లలో ప్రజలకు చూపించడానికి ఏదీ లేక నిరాశతో ఉన్న ప్రధాని మోదీ, లోక్ సభలో అధికారిక ప్రసంగాన్ని రాజకీయ ప్రసంగంగా మార్చి అసత్యాలు మాట్లాడారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలపై దాడి చేసిన తీరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి అవమానమని పేర్కొన్నారు. మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 59 సార్లు ప్రస్తావించగా, మహిళల గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడారని పేర్కొన్నారు. మహిళలు బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వడంలేదని దీని ద్వారా తెలుస్తోందని చెప్పారు. మహిళల రిజర్వేషన్‌కు కాంగ్రెస్ ఎప్పటినుంచో మద్దతిస్తోందని ఆయన తెలిపారు.
ప్రధాని ప్రసంగం అంతా పచ్చి అబద్ధాల పుట్ట ఖర్గే విమర్శించారు. 140 కోట్ల దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 చట్టం ప్రకారం, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 33% మహిళల రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పేరుతో కాలయాపన ఎందుకు? అని ప్రశ్నించారు. దేశంలో చేసిన సంస్కరణలన్నీ కాంగ్రెస్ ఘనతలేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ సంస్కరణలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. గ్రీన్ రివల్యూషన్ ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని.. వైట్ రివల్యూషన్ ద్వారా పాలు ఉత్పత్తిని పెంపు, అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌ను అణు శక్తిగా మార్చడం వంటివి 1991లో ఆర్థిక సంస్కరణలను కాంగ్రెస్ చేపట్టిందని వివరించారు. ఆర్టీఐ, ఆర్టీఈ, ఫుడ్ సెక్యూరిటీ చట్టం, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ వంటి కీలక చట్టాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. మహిళల కోసం హిందూ కోడ్ బిల్లులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, గృహహింస నిరోధక చట్టాలు వంటి కీలక చట్టాలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
బీజేపీ మాత్రం మహిళల పట్ల వ్యతిరేక ధోరణి ప్రదర్శించిందని ఖర్గే ఆరోపించారు. హత్రాస్, ఉన్నావ్ ఘటనలపై కేంద్రం సమాధానాలు చెప్పలేదని పేర్కొన్నారు. మహిళా రెజ్లర్లపై జరిగిన ఘటనలపై స్పందన లేదని.. బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేశారని తెలిపారు. NCRB డేటా ప్రకారం మహిళలపై నేరాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 12 ఏళ్ల పాలన తర్వాత దేశంలో అంతర్జాతీయ సంక్షోభం, పెరుగుతున్న ధరలు, ఆర్థిక క్షీణత వంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి దేశానికి చెప్పింది రాజకీయ ప్రసంగమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంస్కరణలను మోదీ నీరుగార్చారని మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళా వ్యతిరేకులు అని ఆరోపించారు.మోదీ దేశానికి అబద్ధాలు చెప్పడం ఆపాలని చెప్పారు.

