గెలిచిన “ఒంటరి” పోరాటం

కలం, మెదక్ బ్యూరో : మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ (Mallanna Sagar) ముంపు గ్రామాల ఒంట‌రివారు గత ఎనిమిదేళ్లుగా చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. పుట్టిన‌ప్ప‌టి నుండి గ్రామంలోనే ఉండి వృద్ధాప్య ద‌శ‌లో సొంత ఊరును, సొంత మ‌నుషుల‌ను కోల్పోయిన‌ ఒంట‌రిత‌నంలోనూ ఆత్మస్థైర్యం కోల్పొకుండా 8 యేళ్ల పాటు ప్ర‌భుత్వం పై న్యాయ పొరాటం చేసి వారు విజ‌యం సాధించారు . సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి ప్ర‌భుత్వం చేత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని సాధించారు.

సిద్ధిపేట‌ జిల్లా తొగుట -కొండ‌పాక మండలాలో 50 టిఎంసీల సామ‌ర్ధ్యంతో మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును నిర్మించింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వం. మల్లన్న సాగర్ నిర్మాణం కారణంగా సిద్దిపేట జిల్లాలోని సుమారు 10–15 గ్రామాలు ప్రభావితమయ్యాయి. వేలాది కుటుంబాలు తమ భూములు, ఇళ్లు కోల్పోయి పునరావాసం కాల‌నీల‌కు తరలించబడ్డారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టుకు 2015 లో శంఖుస్థాపన చేస్తే ..2022 పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్క‌డాలేని విధంగా భూముల కోల్పోతున్న రైతులు ప్రాజెక్టును వ్య‌తిరేకించి , పెద్దఎత్తున పోరాటం చేశారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ల‌న మొత్తం 8 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ గ్రామాలలోని దాదాపు 6,800 కుటుంబాలు తమ పంట భూములను, ఉపాధిని ,ఇండ్ల‌ను పూర్తిగా కోల్పోయారు. వ్య‌వ‌సాయం మీద అధార‌ప‌డి ఉన్న రైతులు మరియు గ్రామీణ ప్రజలు ప్ర‌భుత్వం ఇచ్చే ప‌రిహారం విష‌యంలో అనేక స‌మ‌స్యలు, స‌వాళ్లు ఎదుర్కొకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం స‌ర్వం త్యాగం చేస్తున్న ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తగినంత కాదని చాలామంది నిరసనలు తెలిపి ,న్యాయం కోసం కోర్టుల‌కు అశ్ర‌యించారు.

పరిహారం పలు విధాలు..

మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఒకే విధంగా కాకుండా భూమి రకం, సమయం, ప్యాకేజీ (R&R) ఆధారంగా మారుతూ వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రారంభంలో
భూములు ఇచ్చిన వారికి ప్రతి ఎకరాకు సుమారు 6 లక్షల నుండి 7.5 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. త‌ర్వాత‌ భూములు ఇవ్వ‌డానికి రైతులు ముందుకు రాక‌పోవ‌డం ,నిర‌స‌న నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎక‌రంకు 8 లక్షలు వ‌ర‌కు పరిహారం ఇచ్చారు. కొన్ని గ్రామాల ప్ర‌జ‌లు భూమ‌లు ఇవ్వ‌డానికి స‌సేమిరా అన‌డంతో పాటు త‌మ భూముల‌ను కాపాడుకోవ‌డానికి పెద్దఎత్తున ఉద్య‌మాలు చేశారు. అస‌లు మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు అవ‌స‌రం లేదంటూ, పరిహారం విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి స‌రిగా లేద‌ని కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. రైతుల డిమాండ్ల తర్వాత ఎకరకు అదనంగా 5 లక్షలు పెంచి మొత్తం 13 లక్షలు వరకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ప‌రిహారం విష‌యం ప్ర‌భుత్వం మూడు విధాలుగా ఇచ్చింది.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అంద‌ని ఒంట‌రివారు…

మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు భూసేక‌ర‌ణ కోసం గ‌త కేసీఆర్ ప్రభుత్వం కేవ‌లం నిర్వాసిత కుటుంబాల ప్ర‌తిపాదిక‌న మాత్ర‌మే పున‌రాస‌న ప్యాకేజిను ఇచ్చారు. కానీ వృద్ధులు, ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు మాత్రం ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని అందించలేదు. దీంతో అందరికి పరిహారం ఇచ్చినట్లుగానే ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు సైతం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అందించాలని కోరుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ కు చెందిన భూ నిర్వాసితులు హయాతుద్దీన్, శ్రీనివాస్ రెడ్డిల సహాయంతో 2019 జూలై 10వ తేదీన వేములఘాట్ కి చెందిన 52 మంది ఒంటరి మహిళలు, పురుషులతో 2019 లో కోర్టును అశ్ర‌యించారు. 2021 లో మ‌రో ముంపు గ్రామం ఏటిగ‌డ్డ కిష్టాపూర్ కి 27 మంది ఒంట‌రివారు ప‌రిహారం కోసం ఇదే త‌ర‌హ కేసు వేశారు. ఈ రెండు గ్రామాల‌కు చెందిన ఒంట‌రి వారు వేసినా కేసును విచారించిన కోర్టు 2023 నవంబ‌ర్ 10 తేదిన వీరికి పూర్తి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజిని నాలుగు నెల‌ల్లో చెల్లించ‌ల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. నాలుగు నెల‌లైన కోర్టు ఉత్తర్వుల ప్ర‌కారం ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ ఇవ్వ‌లేద‌ని ప‌లువురు ఒంట‌రి వారు 2024 ఏప్రిల్ లో సంబంధిత అధికారుల పై కోర్టు ధిక్కార‌ణ కేసు వేశారు.

ఈ కేసు విష‌యంలో ఒంట‌రివారికి ప‌రిహారం ఇవ్వ‌కుండా అధికారులు జాప్యం చేయ‌సాగారు. కేసు విచార‌ణ సంధ‌ర్భంగా 2025 జూలై లో కోర్టు  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి రాష్ట్ర సిఎస్ తో స‌హ అందరికి వారెంట్ జారీ చేస్త‌మ‌ని చెప్ప‌డంతో…ఆరువార‌ల్లో పరిహారం ఇస్తామని న్యాయ‌స్థానంకు చెప్పి కోర్టు ధిక్కార‌ణ కేసు నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. అయినా కుడా కోర్టు అదేశాల ప్ర‌కారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల‌ను ఒంట‌రి వారికి ఇవ్వకపోవడంతో డిసెంబ‌ర్ 2025 కేసు రీ ఓపెన్ పిటిష‌న్ వేశారు. ఒంట‌రి వారికి పరిహారం ఇవ్వ‌కుండా కాల‌యాప‌న ఎందుకు చేస్తున్నారో …స్టేట్ పైనాన్స్ సెక్ర‌ట‌రీ కోర్టు కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాలని చెప్పింది. దీంతో అనివార్యంగా ఈ నెల‌ 14 న‌ మంగ‌ళ వారం రోజున కేసులో బ్ర‌తికి ఉన్న వారి బ్యాంకు ఖాత‌లోకి 12,54,000 జ‌మ చేశారు. దాదాపు 8 యేళ్ల సుదీర్ఘ‌ న్యాయ పోరాటం త‌ర్వాత 79 మంది ఒంట‌రి మ‌హిళ‌లు, ఒంట‌రి పురుషులు వృద్దులను ఆర్ అండ్ ఆర్ ప‌రిహారం సాధించుకున్నారు. 2019 నుండి న్యాయవాది సి హెచ్ రవికుమార్ ఒంటరి వారి పరిహారం కోసం వాదించాడు.

మిగిలిన గ్రామాల్లో ప‌రిస్ధితి ఏంటి

2019 నుండి న్యాయ పోరాటం చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద‌ 12 ల‌క్ష‌ల పై చిలుకు ప‌రిహారంను వేముల ఘ‌ట్ , ఏటిగ‌డ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన 79 మంది ఒంట‌రి మ‌హిళ‌లు, ఒంట‌రి పురుషులు వృద్ధులు మాత్ర‌మే కేసులు వేసి ల‌బ్ధిపొందారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు మిగిలిన ముంపు గ్రామాల ఒంట‌రి వారు కేసులు వేయ‌లేదు. అయితే తాజాగా కోర్టు తీర్పు అమ‌లై, ప‌రిహారం అంద‌టంతో మిగిలిన ముంపు గ్రామాల ఒంట‌రివారికి కుడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు ముంపు గ్రామాల వారు. కేసుల‌తో సంబంధం లేకుండా అన్ని ముంపు గ్రామాల్లోని ఒంట‌రి వారికి ఆర్ అండ్ అర్ ప్యాకేజి ప‌రిహారం అందించి అందుకొవాల‌ని కొరుతున్నారు. మ‌రొవైపు 2019 కేసులు వేసి … ప్ర‌సుత్తం బ్ర‌తికి ఉన్న‌వారికి మాత్ర‌మే ప‌రిహారం ఇచ్చారు..కానీ కేసుల‌లో భాగంగా ఉండి చ‌నిపోయిన వారికి ప‌రిహారం ఇవ్వ‌లేదు.. దీంతో చ‌నిపోయిన వారికి కుడా ప‌రిహారం ఇవ్వాలని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూనిర్వాసిత కుటుంబాల ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి కోల్పోయి కొంద‌రు, ప‌రిహారం చాల‌క మ‌రికొంద‌రు, త‌ల్లిలాంటి ఊరును కోల్పొయి కొత్తగా ఇచ్చిన కాలనీలలో ఉండ‌లేక మ‌రికొంద‌రు…ఇలా ప్రాజెక్టు మిగిల్చిన చేదు అనుభ‌వాలు మాటల్లో చెప్పలేనివి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>