కాకతీయ యూనివర్సిటీకి సహకారం అందించాలి: ఎంపీ కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థ కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి కేంద్రం ఆర్థిక, విద్యా, పరిశోధన సహకారం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) కోరారు. కాకతీయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలలకు గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు, పరిశోధన, మౌలిక వసతులు, అధ్యాపకుల అభివృద్ధికి మంజూరైన, విడుదలైన, వినియోగించిన నిధుల వివరాలపై సోమవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు.

రూ.50 కోట్ల నిధుల మంజూరు..

ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజుందార్ సమాధానమిచ్చారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)–2.0 పథకం కింద కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్ల నిధులను ఆమోదించినట్లు తెలిపారు. ఈ నిధులు ‘రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్’ విభాగం కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు.

పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ హబ్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పనకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన తాజా నివేదిక ప్రకారం.. కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇప్పటికే రూ.28.56 కోట్లు విడుదలైనట్లు కేంద్రం పేర్కొంది.

పరిశోధనలు పెరగాలి..

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక పరిశోధన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరారు.

నిధుల విడుదలతో బాధ్యత ముగిసిపోదని, వాటిని సకాలంలో పూర్తిగా వినియోగించి పరిశోధన, మౌలిక వసతులు, అధ్యాపకుల సామర్థ్యాల పెంపునకు ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత నిధులు, సహకారం అందేలా తన ప్రయత్నాలు కొనసాగిస్తానని ఎంపీ కావ్య స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>