కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా పరిధితో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆలయాలను లక్ష్యంగా చేసుకుని.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తుల ముఠాను(Temple Theft Gang) వీఎం బంజర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.536 కిలోల వెండి వస్తువులు, ఒక కారు, మోటార్ సైకిల్‌తో పాటు చోరీలకు ఉపయోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీఎం బంజర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, జూలై 19 సాయంత్రం సీతారామపురం గ్రీన్‌ఫీల్డ్ హైవే సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కారు, మోటార్ సైకిల్‌పై చోరీ సొత్తును విక్రయించేందుకు తిరువూరు వెళ్తున్న షేక్ జానీ అలియాస్ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు అలియాస్ బాబీ, అర్వ ఉదయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వరుస ఆలయ దొంగతనాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులంతా పాత నేరస్తులే. షేక్ జానీ, అర్వ ఉదయ్ కుమార్‌లపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో డెకాయిటీ కేసు నమోదై ఉంది. షేక్ జానీపై కొత్తగూడెం టూ టౌన్, పాల్వంచ, ఇల్లందు పోలీస్ స్టేషన్‌లలో ఇళ్ల దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. మరో నిందితుడు పేరాల నరసింహారావుపై హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు దొంగతనం కేసులతో పాటు ములకలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్‌లలో ఆలయ దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వరుస చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ 27న కొత్తగూడెం హనుమాన్ బస్తీలోని ఆలయంలో బంగారు బొట్టు, జూన్ 28న పెనుబల్లి మండలం ఉప్పల్ చెలక అక్కమ్మ గుడిలో బంగారు సూత్రాలు, జూన్ 30న తల్లాడ మండలం అంజనాపురంలో వెండి కిరీటం, వెండి నేత్రం, తమలపాకుల హారం చోరీ చేసినట్లు తేలింది.
అదే రోజు రాత్రి కల్లూరు మండలం గణయా తండాలో, జూలై 6న వేంసూర్ మండలం లింగపాలెం హరి హరి క్షేత్రంలో బంగారు సూత్రాలు, వెండి వస్తువులను అపహరించారు. అనంతరం జూలై 7న ఆంధ్రప్రదేశ్‌లోని గోకవరం గంగాలమ్మ ఆలయంలో బంగారు నేత్రాలు, సూత్రాలు, జూలై 10న పెనుబల్లి మండలం బయన్నగూడెంలో వెండి కిరీటాన్ని చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి చోరీ చేసిన సొత్తుతో పాటు ఇనుప రాడ్, సుత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ వంటి పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఆలయాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

