epaper
Wednesday, February 18, 2026
epaper

భారత వృద్ధిలో నమ్మకమైన భాగస్వామి మలేషియా : ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: భారత ఆర్థిక వృద్ధికి మలేషియా (Malaysia) నమ్మకమైన భాగస్వామి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం మలేషియా చేరుకున్న ఆయన రాజధాని కౌలాలంపూర్​లో భారత సంతతి ప్రజలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. గతంలో విదేశీ ఉత్పత్తులకు భారత్​ కేవలం అతిపెద్ద మార్కెట్​లా మాత్రమే కనిపించేదని, ప్రస్తుతం పెట్టుబడులు, వాణిజ్యానికి హబ్​లా మారిందని ప్రధాని చెప్పారు. ‘యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాంండ్​, ఒమన్​, ఈయూ లేదా అమెరికా దేశమేదైనా సరే అభివృద్ధిలో భారత్​ నమ్మకమైన భాగస్వామిగా మారింది. అందుకే ఇవన్నీ భారత్​తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి’ అని ప్రధాని అన్నారు.

కొత్త కాన్సులేట్​, తిరువళ్లువర్​​ స్కాలర్​షిప్స్​​​..

‘భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మలేషియాది రెండో స్థానం. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. ఇవి రెండు దేశాల్లోని ప్రజల హృదయాలను కలుపుతున్నాయి. మీరు ఆ బంధాలకు వారధులు. ఇక్కడి రోటి కెనాయ్​తో​ మలబార్​ పరోటాను కలిపారు. అంతేకాదు, కౌలాలంపూర్​ అయినా కొచ్చి అయినా… కొబ్బరి, మసాలాలు, తెహ్​ తారిక్(ఒక రకం టీ)​ పరిమళాలు రెండు చోట్లా ఒకే విధంగా గుబాళిస్తాయి. మన భాషల్లోనూ ఎన్నో పదాలు ఒకే రకంగా కనిపిస్తాయి. మలేషియాలో భారత సినిమాలు, సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉందని నాకు తెలుసు. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రధాని ఇబ్రహీం అన్వర్ అద్భుతంగా పాడతారు. గతంలో భారత్​కు వచ్చినప్పుడు ఆయన హిందీ పాటలు పాడిన వీడియోలు వైరల్​ అయ్యాయి. ఆయనకు తమిళ్​ పాటలతోపాటు దివంగత నటుడు ఎంజీఆర్​ అంటే ఎంతో ఇష్టం’ అని ప్రధాని (PM Modi) ప్రస్తావించారు.

కాగా, ఇండియాలో చదివే మలేషియాలోని భారత సంతతి విద్యార్థులకు తిరువళ్లువర్​ పేరుతో స్కాలర్​షిప్​లు ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. అలాగే, మలేషియాలో త్వరలోనే కొత్త కాన్సులేట్​ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

ఒకే కారులో సభా ప్రాంగణానికి..

అంతకుముందు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి మలేషియా ప్రధాని అన్వర్​ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలు వందలాది మందితో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు.

మలేషియా ప్రధాని అన్వర్​ ఇబ్రహీం మాట్లాడుతూ.. తన మిత్రుడైన మోదీ మలేషియాకు రావడం వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. భారత్​, మలేషియా మధ్య వందల ఏళ్ల వర్తక, వాణిజ్య, సాంస్కృతిక బంధాలను గుర్తుచేశారు. ‘భారత్​ లేదా ఇండియా పేరేదైనా కావచ్చు.. మలేషియాకు టాప్​ ట్రేడింగ్​ పార్టనర్​. ఇది కేవలం ఉత్పత్తులకు మాత్రమే సంబంధించింది కాదు. గత ఏడాది భారత్​ నుంచి 15 లక్షల మంది మలేషియాను సందర్శించారంటే ఈ బంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు’ అని అన్వర్​ అన్నారు.

Read Also: మరోసారి సిట్ ముందుకు కేటీఆర్, హరీశ్ ?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>