కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తర తెలంగాణ పరిధిలోని పలు కీలక ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీ(Dead Storage)కు చేరుకున్నాయి. వానాకాలం ప్రారంభమై రెండు వారాలవుతున్నా వర్షాలు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,064.30 అడుగులు(15.149 టీఎంసీలు) మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇందులో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, మరో 5 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కేటాయించాల్సి ఉండటంతో, సాగు నీరు 5 టీఎంసీలకే పరిమితమైంది. దీంతో ప్రాజెక్టు కింద సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
వచ్చింది ఒక టీఎంసీ వరద..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటితోనే ఆయకట్టు కింద పంటల సాగు జరుగుతుంది. ఈసారి వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి జూన్ నెలలో ఒక టీఎంసీ వరదనే వచ్చింది. గతంలో ఇదే సమయంలో10 టీఎంసీలు అంతకు మించి వరద వస్తే.. గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదిలే పరిస్థితులు ఉండేవి. గతేడాది ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా పూడిక కారణంగా నీటి నిల్వ చేయలేక కిందకి వదిలారు.
ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండగా సమీపంలోని మెండోరా, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో బోర్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో వెంటనే పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. లేదంటే భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలో వర్షాలు కురిస్తేనే..
ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిసి వరదలు వస్తేనే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లేదంటే ఈసారి గడ్డు పరిస్థితే ఎదురయ్యేలా ఉంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈసారి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందువల్ల బోరు బావులు, ఎత్తిపోతల పథకాలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాలపై ఆధారపడి ముందస్తుగా పంటలు సాగు చేయవద్దని రైతులకు సూచించింది.
నిజాం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో నిల్..
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. సోమవారం నాటికి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను 6.649 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇన్ ఫ్లో ఏమాత్రం లేదు. తాగునీటి అవసరాలు ఇతర అవుట్ ఫ్లోగా 168 క్యూసెక్కులు బయటకు పోతోంది.
ఇప్పటికే ప్రాజెక్టు నీటిని నమ్ముకుని రైతులు బోర్లు, బావుల కింద వానాకాలం పంటల సాగుకు సిద్ధమయ్యారు. దుక్కులు దున్ని పెట్టుకున్నారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, ఎడపల్లి, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నిచోట్ల నాట్లు కూడా వేశారు. వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు.
గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ఇలా..
ఎడపల్లి మండలంలోని అలీసాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1,299.6 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 1,295.6 అడుగుల మేర ఉంది. అలీసాగర్ నుంచి రోజూ నిజామాబాద్ సిటీ ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్ బెడ్ ద్వారా 30 క్యూసెక్కులు సరఫరా అవుతోంది. జలాశయంలో నీరు మరో 28 రోజుల వరకు తాగునీటి సరఫరాకు సరిపోతాయి.
ఈ ప్రాజెక్ట్ కింద ఎడపల్లి మండలంలో 18 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి కూడా గోదావరి వరదనే ఆధారం కావడంతో సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.

