Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!

కలం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ ఎన్నికల వ్యూహ రచనను ఇప్పటి నుంచే ప్రారంభించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై దశలవారీగా సర్వే కొనసాగుతున్నది. మరోవైపు సీఎంవో స్థాయిలోనే మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు మరో సీక్రేట్ సర్వే జరుగుతున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఈ సర్వే ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయాలను ముందుగానే గుర్తించి, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.

పథకాలపై ప్రజల స్పందన

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉంది? వాటి ద్వారా ప్రభుత్వం ఆశించిన రాజకీయ ప్రయోజనం ఎంత మేర దక్కుతున్నది? ఎక్కడ అసంతృప్తి ఉంది? అనే అంశాలను కూడా ఈ సర్వేలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. పథకాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర, స్థానిక సమస్యల పరిష్కారంలో వారి స్పందన, ప్రజలతో మమేకమవుతున్న తీరు వంటి అంశాలపై కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తున్నది.

మంత్రుల పనితీరుపై స్పెషల్ ఫోకస్

ఇటీవల కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠపై ఎంత మేర ప్రభావం చూపుతున్నాయనే అంశంపైనా ఈ సర్వేలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారి పనితీరుపై ప్రజల అభిప్రాయం, విపక్షాల విమర్శలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయి, పార్టీ కేడర్‌లో పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై గ్రౌండ్ లెవల్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న చోట ముందుగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ నివేదిక ఉపయోగపడే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఎంపిక చేసిన సెగ్మెంట్ల లోనే..

రాష్ట్రవ్యాప్తంగా కాకుండా రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లోనే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు, రాజకీయంగా పోటీ ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు, ఇటీవల వివాదాలు లేదా అసంతృప్తి వ్యక్తమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. అక్కడ ప్రజాభిప్రాయం, పార్టీ బలం, ప్రభుత్వంపై సంతృప్తి స్థాయిని విశ్లేషిస్తున్నట్లు చెప్తున్నారు.

హైకమాండ్‌కు నివేదిక?

టీపీసీసీ నిర్వహిస్తున్న సర్వే ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారిస్తుండగా, ప్రభుత్వ స్థాయిలో నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఈ సర్వే నివేదికను ఏఐసీసీ అగ్రనాయకత్వానికి అందించే అవకాశముందని ఆ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, ప్రజల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై సమగ్ర అంచనాతో భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ నివేదిక ఉపయోగపడే అవకాశముందని వారు భావిస్తున్నారు.

ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైన మార్పులు చేసుకోవాలన్న వ్యూహంతోనే అధికార పార్టీ కదులుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువగా తిరగాలని సీఎం పలుమార్లు సూచించిన నేపథ్యంలో, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం, మంత్రుల పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, విపక్షాల ప్రచారం ఎంత మేర పనిచేస్తుందనే అంశాలపై వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రానున్న రోజుల్లో సంస్థాగతంగా, రాజకీయంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీ ఫీడ్‌బ్యాక్, ప్రైవేట్ సర్వే సంస్థల ద్వారా వచ్చిన సమాచారాన్ని పరస్పరం పోల్చి చూస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ మొత్తం కసరత్తు లక్ష్యం ప్రభుత్వం, పార్టీపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ, ఎన్నికల నాటికి ప్రతికూలతలను తగ్గించి అనుకూల వాతావరణాన్ని నిర్మించడమేనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>