Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై క్రిమినల్ కేసు నమోదు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై (Gangula Kamalakar)  పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఒక స్థలంలోకి ఎమ్మెల్యే స్థానికులతో కలిసి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా షెడ్డు రేకులను తొలగించారనే తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే..

రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శ్రీరాజరాజేశ్వర కాలనీలోని సర్వే నెంబర్.126లో ప్లాట్ నంబరు 273కు సంబంధించి శ్రీకర్, లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై కరీంనగర్ ఆర్డీవో ఇప్పటికే ‘స్టేటస్ కో’ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అంటే సదరు స్థలంలో ఎలాంటి మార్పులు చేయకూడదని అర్థం. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించారంటూ స్థానిక తహసీల్దార్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. BNSS 2023 సెక్షన్ 164 ప్రకారం స్టేటస్ కో ఇచ్చిన భూమిలోకి వెళ్లడం నేరంగా పరిగణించాలని తహసీల్దార్ కోరారు.

వివాదం తలెత్తినట్లు ఆర్ఐ నివేదిక..

ఈ భూమికి సంబంధించి శ్రీకర్, గాండ్ల లక్ష్మినారాయణతో పాటు మరికొందరి మధ్య వివాదం తలెత్తిందని ఆర్ఐ ఇప్పటికే నివేదిక ఇచ్చారని తహసీల్దార్ ఫిర్యాదులో వివరించారు. ఎమ్మెల్యే కాలనీ వాసులతో వివాదాస్పద భూమిలోనికి వెళ్లినట్లు వీడియో క్లిప్పింగులు చూశామని తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎమ్మల్యే గంగులపై కేసు నమోదు వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>