కలం, మెదక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా రైతులు, ప్రజలు కీలక అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సంగారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (Chinta Prabhakar) అన్నారు. సీఎం అధికారిక పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలలో సుమారు 397 గ్రామాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సంగమేశ్వర–బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని చింత ప్రభాకర్ (Chinta Prabhakar) డిమాండ్ చేశారు. సీఎం పర్యటన సందర్భంగా కొత్త హామీలు ఇవ్వడం కంటే గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులను వాస్తవంగా మంజూరు చేసి పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
నిలిచిపోయిన నిధులు విడుదల చేయాలి
గత ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రూ.29.33 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరయ్యాయని చింత ప్రభాకర్ తెలిపారు. అలాగే సదాశివపేట పట్టణానికి రూ.8 కోట్లు, సంగారెడ్డి పట్టణానికి రూ.20 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిలిచిపోయిన ఈ నిధులను తిరిగి మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సీఎం పర్యటనతో సంగారెడ్డి జిల్లా ప్రజలకు వాస్తవమైన ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ముఖ్యమంత్రి కల్వకుంట్ల అంటూ దానం స్పీచ్.. పార్టీ మార్పుకు సంకేతమా?
Follow Us On: X(Twitter)

