కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని గిరిజన యువతకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఛత్రు నాయక్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను పొందాలంటే సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, వృత్తిపరమైన శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు కౌన్సెలర్ల ద్వారా మోటివేషన్ శిక్షణ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలతో పాటు వివిధ ట్రేడ్లలో అందించే ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, వాటి ద్వారా లభించే ఉద్యోగావకాశాల గురించి వారు వివరించారు.
మెగా స్కిల్ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ..
పది, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు హైదరాబాద్‌లోని మెగా స్కిల్ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ఛత్రు నాయక్ తెలిపారు. కోర్సును బట్టి శిక్షణ కాల వ్యవధి మూడు నుంచి ఆరు నెలల వరకు ఉంటుందని చెప్పారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డొమైన్, నాన్-డొమైన్ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారని వివరించారు. డొమైన్ కోర్సుల్లో టూరిజం, హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీషియన్ కోర్సులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ తదితర కోర్సులు ఉంటాయన్నారు. నాన్-డొమైన్ అంశాల్లో సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు వంటి వాటిలో ట్రైనింగ్ ఉంటుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డీఆర్వో నిర్మల, కౌన్సిలింగ్ నిపుణులు రవి శంకర్, రాంబాబు, నేహా డాలీ తదితరులు పాల్గొన్నారు.

