కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) అసంతృప్తి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పోచారం అర్థం చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వం నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించారని చెప్పుకొచ్చారు. ప్రతి నెల రూ.7 వేల కోట్ల వాయిదాలు చెల్లిస్తున్నామని.. నిధుల విడుదల ఆలస్యం అవుతుందని తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని విన్నవించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు, అని ఆయన ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉందన్న విషయం ఆయనకు తెలియనిది కాదు అని అన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, ఈ ఇబ్బందులను ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు.
అసలేమైందంటే?
ఆదివారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddapur Reservoir) వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ లు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు సైతం 20 సార్లు ఫోన్ చేసిన స్పందించడం లేదని, ఏం చెయ్యాలని ప్రశ్నించారు. బిల్లులు రాక అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోనే లిఫ్ట్ చేయడం లేదని.. నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన చెందారు. బిల్లులు ఆలస్యంపై పోచారం అసంతృప్తి వ్యక్తం చేయడంతో మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఈ మేరకు స్పందించారు.
Read Also: చైనాలో మరో అద్భుతం.. కుక్కలను షికారుకు తీసుకెళ్తున్న ‘రోబో డాగ్స్’
Follow Us On: Sharechat

