కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్ పదేళ్ల పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనపై చర్చకు సిద్ధం అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ లో తప్పులకు కేంద్ర బిందువైన హరీశ్ రావు కరువు కరువు అంటూ ఏకరువు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.. బావ బామ్మర్దులది విచిత్ర పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని.. ఆశలు పెట్టుకున్న రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాలేవని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన సువర్ణ ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ దని కొనియాడారు. బీఆర్ఎస్ పదేళ్ల రాబందు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో అన్ని తానై వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు తనకు సంబంధం లేదంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. ఎంతోమంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదన్నారు.
హామీలను మెజార్టీ పూర్తి చేశామని వివరించిన మహేశ్.. బీజేపీ నేతలకు సైతం కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ ఆస్తుల సొత్తును దోచుకోవాలని ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని.. దొంగల్లా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ పేరుతో నానాయగి చేస్తున్నారని.. పేదవాడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రజలను ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయా ఎంపీ అరవింద్? అంటూ నిలదీశారు. నీట్ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణం అని వ్యాఖ్యానించారు. నియంత పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందని అన్నారు.

