కలం, వెబ్‌డెస్క్: వనపర్తి సర్కారు బడిలో చదివి తెలంగాణకు సీఎం అయ్యానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో నిర్వహించిన గురు పూజా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 127 మంది ఉపాధ్యాయులను సన్మానించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లల గొప్ప భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని, పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడంలో వారిదే కీలక పాత్ర అని తెలిపారు. ఉపాధ్యాయులు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయని తెలిపారు.
దేశంలో గొప్ప గొప్ప ప్రధానులు, సీఎంలు అందరూ సర్కార్ బడుల్లో చదివిన వారేనని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. ఇక సర్కారు బడులు, టీచర్లకు సంబంధించి గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు టీచర్లకు ఎన్నో సమస్యలు పెండింగ్ ఉన్నాయన్నారు. తెలంగాణ పితామహుడు కేకే కమిటీ ద్వారా భారీ విద్యా సంస్కరణలు తీసుకొస్తామని తెలిపారు. 15-20 ఏళ్లుగా టీచర్లకు ప్రమోషన్లలో జాప్యం నెలకొందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన 55 రోజుల్లోనే 10 వేల మంది టీచర్ల నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు అడక్క ముందే ప్రమోషన్లు కూడా ఇచ్చామన్నారు. 317 జీవోతో బదిలీ సమస్యలకు కూడా పరిష్కారం చూపినట్లు తెలిపారు.
టీచర్లు తలచుకుంటే ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని ఎటు వైపైనా తిప్పేస్తారని సీఎం అన్నారు. అలాంటి టీచర్లు తమ హక్కుల కోసం ధర్నా చేయడం చాలా బాధను కలిగించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నో సమస్యలను పరిష్కరించేక వదిలిపెట్టి పోయిందన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు రిటైరల్ అవుతున్నారని, ప్రతి ఉద్యోగికి సగటున రూ.కోటి ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ వేల కోట్లు అప్పు పెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు భరోసా
కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై సీఎం స్పందించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోనన్నారు. ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతిపక్షాలు విద్యార్థులను అడ్డుపెట్టుకొని తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించి తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.
Also Read : హామీలు చాలు.. సమస్యలు తీర్చండి : బండి సంజయ్
Follow Us On : WhatsApp

