కలం, కరీంనగర్ బ్యూరో: ఉపాధ్యాయ దినోత్సవం (Teachers Day) సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ”ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉపాధ్యాయులు కన్నీళ్లు కారుస్తారో ఆ దేశం, ఆ రాష్ట్రం బాగుపడదనే వాస్తవాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలి. ఇకనైనా టీచర్లకు హామీల పాఠాలు చెప్పడం ఆపి, వారి సమస్యల పరిష్కారం అనే పాఠాన్ని ప్రభుత్వం నేర్చుకోవాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
డీఏలు ఇవ్వకపోయినా, పీఆర్సీ అమలు చేయకపోయినా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా భరిస్తూ ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న గురువులందరికీ అభివందనాలు తెలిపారు. పాఠశాలే సర్వస్వంగా భావించి జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించిన రిటైర్డ్ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, మలిసంధ్యలో కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరగడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల కనీస సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజునైనా టీచర్ల పెండింగ్ సమస్యలపై దృష్టి సారించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని, వెంటనే బకాయిలు విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : సర్కార్ బడిలో చదివి సీఎం అయ్యాను: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

