కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సోమవారం మహబూబ్‌నగర్ (Mahbubnagar) పట్టణంలోని ఎస్‌వీఎస్ హాస్పిటల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కొందరు వ్యక్తులు వాస్తవాలకు విరుద్ధంగా మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు నిర్వహించడం పోలీసుల దృష్టికి వచ్చినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న వ్యక్తిగత వివాదానికి సంబంధించినదేనని , దీనికి ఎలాంటి మత, సామాజిక లేదా వర్గపరమైన కోణం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ మేరకు రోడ్డు ప్రమాదం అనంతరం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినది, ఈ ఘర్షణ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, సంబంధిత వ్యక్తులపై FIR నమోదు చేయడం జరిగినట్లు వెల్లడించారు. అయితే కొంతమంది వ్యక్తులు నిర్ధారణ కాని సమాచారాన్ని, వాస్తవాలకు విరుద్ధమైన సందేశాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు, అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసు శాఖ వాటిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం పోలీసు శాఖ విడుదల చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు, రెచ్చగొట్టే లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్రచారం చేసే వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి సామాజిక సామరస్యాన్ని కాపాడాలని, అనుమానాస్పద పోస్టులు లేదా వదంతులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

