కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో (Karimnagar) నిర్వహించిన సమావేశంలో సంఘం కీలక నేత దోగ్గలి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తున్నాయని వాపోయారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల, కళాశాల దోపిడీని అరికట్టాలని, లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచుకున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలతో కుమ్ముక్కవుతున్నారని, ఎన్ని ఫిర్యాదులు చేసినా లైసెన్స్ ఇచ్చేస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులను ఫలానా దుకాణం నుంచే విద్యా సామగ్రి కొనుగోలు చేయాలని బలవంతపెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు అమ్మినా విద్యాశాఖ అధికారి స్పందించడం లేదన్నారు. విద్యాశాఖ అధికారుల పనితీరు మార్చుకోకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. యువజన సంఘం నేత మాదాసు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

