Mobile Popup Ad
Mobile Popup Ad

కుళ్లిన చికెన్​.. హైదరాబాద్​ టు ఏపీ..!

క‌లం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌ (Hyderabad)లో మ‌రో భారీ క‌ల్తీ దందా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో కుళ్లిన ఫుడ్ పెడుతున్నార‌న్న ఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే కుళ్లిన చికెన్‌ను చేప‌ల మేత‌గా వాడుతున్న విష‌యం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో హెచ్ ఫాస్ట్ అధికారులు మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా ర‌వాణా అవుతున్న‌ కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాల (Chicken Waste) దందా బట్టబయలైంది. న‌గ‌రం నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 90 టన్నుల కుళ్లిన చికెన్ వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ర‌వాణాకు ఉప‌యోగించిన 7 వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, లైసెన్సులు లేకుండానే ఈ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని వివిధ చికెన్ సెంట‌ర్ల నుంచి సేకరించిన కోళ్ల వ్యర్థాలను ఏపీలోని చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించేందుకు మళ్లిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. శాస్త్రీయ పద్ధతిలో అధీకృత ప్రాసెసింగ్ కేంద్రాల్లో నిర్వీర్యం చేయాల్సిన ఈ వ్యర్థాలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం చికెన్ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం నిబంధనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేశారు. కుళ్లిన చికెన్‌ను చేప‌ల‌కు మేత‌గా వేయ‌డం స‌రికాద‌ని, ఇది చాలా ర‌కాల క్యాన్స‌ర్ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>