కలం, డెహ్రాడూన్: అయోధ్య ఆలయ (Ayodhya Temple) విరాళాల స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) విరాళాలపైనా అనుమానాలు మొదలయ్యాయి. బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల నిర్వహణలో ఆర్థిక అక్రమాలు జరిగాయని భైరవ్ సేన అనే సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ వ్యక్తిగత సహాయకుడి పాత్ర ఇందులో ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వీటిని తీవ్రంగా పరిగణించిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) విచారణకు ఆదేశించింది. మరోవైపు అయోధ్య విరాళాల్లో రూ.7 కోట్ల వరకు పక్కదారి పట్టాయన్న కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది.
బద్రీనాథ్ వివాదం ఏమిటి?
బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల నిర్వహణలో ఆర్థిక అక్రమాలు జరిగాయని భైరవ్ సేన అనే సంస్థ ఆరోపించింది. ఆలయ కమిటీ చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపించింది. సోషల్ మీడియాలో చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు. ఆయన బీకేటీసీకి చెందిన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని వివరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కూడా కోరినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల నుంచి వివరణ
ఈ వ్యవహారంపై బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CEO) సోహన్ సింగ్ రంగాద్ మాట్లాడుతూ.. చైర్మన్ ఆదేశాల మేరకు సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కోరుతున్నామని, నిష్పాక్షిక విచారణ కోసం అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను కూడా పంపినట్లు సీఈఓ వెల్లడించారు. కమిటీ ఏర్పడిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధారాలు, పత్రాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. విచారణలో ఏవైనా అక్రమాలు లేదా అవకతవకలు వెలుగులోకి వస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయోధ్య రామ మందిరంలో కఠిన నిబంధనలు
అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విరాళాల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా హుండీ నగదు లెక్కించే సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు వినియోగించడంపై పూర్తిగా నిషేధం విధించింది.
విరాళాల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి జేబులు లేని ప్రత్యేక యూనిఫాంలను తప్పనిసరి చేసింది. నగదు లేదా విలువైన వస్తువులను దాచుకునే అవకాశం లేకుండా ఉండేందుకు ముదురు నీలం రంగులో పాకెట్‌లెస్ డ్రెస్‌ను అందించనుంది. హుండీ లెక్కింపు హాలులోకి ప్రవేశించే ముందు ప్రతి ఉద్యోగికి రెండంచెల భద్రతా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. విరాళాల లెక్కింపు విధానంలోనూ మార్పులు చేశారు.
ఇకపై సిబ్బంది బల్లలు, కుర్చీల వద్ద కాకుండా నేలపై కూర్చునే నగదు, ఇతర కానుకలను లెక్కించనున్నారు. మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గత ఐదేళ్లలో ఆలయ నిర్మాణ వ్యయాలు, భక్తులు సమర్పించిన విరాళాలు, నిధుల వినియోగాన్ని సమగ్రంగా పరిశీలించనుంది.

