మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ మాద్వి హిడ్మా(Madvi Hidma) ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం క్రితం హిడ్మా లొంగుబాటుకు యత్నించినట్టు సమాచారం. ఈ మేరకు ఓ జర్నలిస్టుతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లేఖ కూడా బయటకు వచ్చింది. అయితే పోలీసులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా చివరకు ఏపీలో పోలీసుల చేతికి చిక్కారు. ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి కేవలం పది రోజుల ముందే ఒక కీలక నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. చివరి నిమిషంలో అస్త్రాలు వదిలి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.
జర్నలిస్టుకు రహస్య లేఖ
హిడ్మా ఇటీవల ఒక జర్నలిస్టుకు రహస్య లేఖను పంపించినట్టు సమాచారం. ఆ లేఖలో తాను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి తన భద్రతకు హామీ లభిస్తే, ఆయుధాలు వదిలేసి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని రాసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడ, ఎలా లొంగిపోవాలనే అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. లొంగిపోయే ముందు కొన్ని కీలక విషయాలపై చర్చించాల్సి ఉందని, వాటిపై హామీలు కావాలని కూడా ఆ లేఖలో వివరించాడని సమాచారం. లొంగేపోయే క్రమంలోనే ఏపీకి వచ్చినట్టు సమాచారం.
ఆడియో సందేశం విడుదలకు ఏర్పాట్లు
తన ఆలోచనలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయడానికి హిందీ, తెలుగు భాషల్లో ఓ ఆడియో సందేశం విడుదల చేయాలని హిడ్మా(Madvi Hidma) యోచించినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రత్యక్షంగా చర్చించేందుకు ఆ జర్నలిస్టును త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కలవమని కూడా సూచించినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఆయన ఎన్‌కౌంటర్‌కు గురికావడం గమనార్హం.
కానీ ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్న తరుణంలోనే, మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో హిడ్మా మృతి చెందడం గమనార్హం. అనేక రాష్ట్రాల భద్రతా బలగాలను ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టిన అతని జీవితం మారేడుమిల్లి అడవిలో ముగిసింది. హిడ్మా లొంగిపోయినా లేదా అరెస్ట్ అయినా మావోయిస్టు కార్యకలాపాలపై కీలక సమాచారం బయటపడేదని భద్రతా వర్గాలు భావించాయి. అయితే హిడ్మా లొంగుబాటుకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు.
Read Also: హిడ్మా అనుచరుడి అరెస్ట్
Follow Us on : Pinterest


