దాంపత్య జీవితం అంటేనే ఓ పెద్ద పజిల్. అర్థమయినట్లే ఉంటుంది కానీ అడుగడుగునా సరికొత్త ఛాలెంజ్‌లను మనముందు ఉంచుతుంది. సంవత్సరాల తరబడి ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టిన వారి జీవితంలో కూడా అనేక ఛాలెంజ్‌లు ఉంటాయి. వాటిలో దాదాపు ప్రతిఒక్క జంట(Life Partner) మధ్యే ఉండే అతిపెద్ద ఛాలెంజ్ అర్థం చేసుకోవడం. అవును.. ఇది చాలా చిన్న విషయమే అనిపించినా.. తన పార్ట్‌నర్ తనను అర్థం చేసుకోవడం లేదన్న ఫీలింగ్ ఇరువురిలో అనిపిస్తుంది. మరికొందరు తనను పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటారు. అయితే నిపుణులు మాత్రం ఇది పెద్ద సమస్య కాదని, చిన్నిచిన్న మార్పులు చేసుకుంటూ, కొన్ని పనులు చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ సమస్య సమసిపోవాలంటే ఒకరి వైపు నుంచి కాదు, ఇద్దరి నుంచి ప్రయత్నం ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏం చెప్తున్నారో చూద్దామా..
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి..
ఎదుటి వారిని అర్థ చేసుకోవడానికి ముందు మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. అసలు మనకున్న బాధ ఏంటి? అది ఎందుకు వస్తుంది? అనేది మనకే క్లారిటీ లేకపోతే.. మన భాగస్వామికి మాత్రం ఏం అర్థమవుతుంది. అలాంటప్పుడే మనల్ని పట్టించుకోరని, అర్థం చేసుకోరని అనిపిస్తుంది. “నా మాట సీరియస్‌గా తీసుకోరు? నా భావాలను నిర్లక్ష్యం చేస్తారా?” అన్న భావనలు మనలో కలుగుతాయి. అయితే అలా ఒక నిర్ణయానికి రావడానికి ముందు అసలు మీ సమస్య ఏంటి? అనేది మీరు అర్థం చేసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు.
టైమ్ కేటాయించండి..
మనకు న్ని పనులు ఉన్నా.. మనసుకు నచ్చిన వారి కోసం సమయం కచ్ఛితంగా లభిస్తుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఇది చాలా విషయాలపై క్లారిటీని తీసుకొస్తుంది. అందులోనూ మరీ ముఖ్యంగా చిన్న గొడవ అయినా, ఏదైనా విషయంలో కోపంగా ఉన్నప్పుడు మొబైల్‌లో స్క్రోల్ చేస్తూ, లేదా రెండో పని చేస్తూ మాట్లాడితే అర్థం కాదు. మీరిద్దరు మాట్లాడుకోవాలి. ఎటువంటి అవాంతరాయాలు, డిస్ట్రాక్షన్ ఉండకూడదు. సంభాషణను.. “నీకు 10 నిమిషాలు టైమ్ ఉందా? నీకు ఓ విషయం చెప్పాలి” ఇలా స్టార్ట్ చేయండి. ఏదో చెప్పాలనుకుంటున్నారని మీరే చెప్పకపోతే వాళ్లకి మాత్రం ఎలా అర్థమవుతుంది. మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని చెప్పాలి అని నిపుణులు చెప్తున్నారు.
నువ్వుకు బదులు నేను, నాకు..
సంభాషణను ప్రారంభించేటప్పుడు కానీ, సంభాషణలో కానీ నువ్వు అని కాకుండా నేను, మనం లాంటివి వాడండి. ఏ విషయాన్ని అయినా ‘నువ్వు’ అంటూ వారికి ఆపాదిస్తే వారు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. ఉదాహరణకు. ‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’ అనడానికి బదులు ‘నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నా, కానీ అందుకు టైమ్ దొరకట్లేదు’ అని చెప్పండి. రూమ్‌లో మూడ్ అంతా మారుతుంది. భాగస్వామి ఎంత కోపంలో ఉన్నా, ఎలాంటి ఆలోచనలో ఉన్నా మీకు సమయం కేటాయిస్తారు. మీరు చెప్పేది వింటారని నిపుణులు అంటున్నారు.
వినడం నేర్చుకోండి..
ఇది చాలా ముఖ్యం. మన భాగస్వామి ఏమైనా చెప్తుంటే మధ్యలోనే ఆపి.. మీకు ఉన్న ప్రశ్నలు అడగడం, లేదా మీ వెర్షన్ వినిపించాలనుకోవడం మానుకోండి. ముందు అసలు అవతలి వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు చెప్పాలనుకునేది, అడగాలని అనున్నేది చేయొచ్చు. మీరిచ్చే ఫీల్, వాళ్లు అర్థం చేసుకోవడం అనే రెండూ వేరే అనుభవాలు. వాళ్లకు కూడా తమ కోణం ఉంటుంది. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటే చాలా మిస్అండర్‌స్టాండింగ్స్ తగ్గిపోతాయి. చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది.
మీకేం కావాలో ఓపెన్‌గా చెప్పండి..
ప్రతి మనిషికి 4-5 అంశాలు కచ్ఛితంగా కావాలి. అది ప్రతి రిలేషన్‌లో ఉండేవి. టైమ్, సపోర్ట్, రికగ్నిషన్, కేర్, రిస్పెక్ట్. మీ భాగస్వామి తన బిజీలోనో, మరే ఇతర వ్యాపకాల వల్లో వీటిలో మీకు ఏదో ఒకటి ఇవ్వలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో దాని గురించి మనోవేదన పడుతూ కూర్చునే బదులు.. అది ఓపెన్‌గా చెప్పండి. ‘‘మీతో మాట్లాడాలి.. కానీ మీకు టైమ్ ఉండట్లేదు’అని అనండి. లేదంటే ‘నాపైన కేర్ తీసుకో’ ఇలా మీకు ఏం కావాలో అది అడగండి. అందులో తప్పులేదు.
మార్పులు కలిసి ప్లాన్ చేసుకోండి
మార్పు అనేది ఇద్దరి వైపు నుంచి ప్రయత్నం జరిగినప్పుడే జరుగుతుంది. ‘రేపటి నుంచి నువ్వు మారు’ అంటే అది జరగదు. మీ దాంపత్య జీవితంలో ఏం మార్చాలనుకుంటున్నారు అనేది దానికోసం చిన్న చిన్న మార్పులను ఇద్దరూ కూర్చుని ప్లాన్ చేసుకోండి. ప్రతి రోజూ కనీసం 10 నిమిషాలు మీరిద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఫోన్ లేకుండా 20 నిమిషాలు కలిసి కూర్చోండి. వారంలో ఒకరోజు వీలు చూసుకుని బయటకు వెల్లండి. ఇలాంటి చిన్నచిన్న మార్పులు మీ దాంపత్య జీవితానికి చాలా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.
అప్రీషియేట్ చేయండి..
మీ భాగస్వామి(Life Partner) ఏదైనా ప్రయత్నిస్తుంటే దానిని అప్రీషియేట్(Appreciate) చేయండి. ఏమీ చేయకపోయినా పర్లేదు కానీ.. డిస్‌కరేజ్ మాత్రం చేయొద్దు. వీలయితే ప్రోత్సహించండి. ఫలితం ఏదైనా సరే.. అప్రీషియేట్ చేయండి. ఇది అవతలి వారిలో పాజిటివిటీని పెంచుతుంది. మీ బంధాన్ని బలపరుస్తుంది. ఈ అప్రీషియేషన్ అనేది మీ బంధంలో కీలక మార్పులకు తొలి అడుగుగా మారుతుంది.
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం..
దాంపత్య జీవితం సమస్యలు అనేవి సర్వసాధారణం. ఈ సమస్యలు ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోవు. దంపతుల మధ్య కమ్యూనికేషన్ ఎంత తరచుగా ఉంటే అంత తక్కువ సమస్యలు వస్తాయి. ఈ కమ్యూనికేషన్స్(Communications) ఎవరిలో వచ్చే మార్పులను వారు చాలా త్వరగా గుర్తించి, సరిచేసుకునే అవకాశాలను పెంచుతుంది.
కోపాన్ని కొంతసేపటికే పరిమితం చేయండి..
దంపతుల(Life Partner) మధ్య చిన్నాచితక గొడవలు జరుగుతూనే ఉంటాయి. వారి మధ్య బంధానికి, ప్రేమకి ఆ గొడవలే నిదర్శనం. గొడవలు లేని దాంపత్య జీవితం అంటే భాగస్వాముల మధ్య ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. గొడవలు జరగడం.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం చాలా మామూలు. కానీ ఆ కోపాన్ని వారాలు, నెలలు, సంవత్సరాలకు సాగదీయొద్దని, నిమిషాలు, గంటల్లోనే ముగించాలని చెప్తున్నారు. భాగస్వాముల మధ్య ‘సారీ’ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ముందు ఎవరు ముందడుగు వేస్తారనేది ముఖ్యం. ఎంత గొడవైనా, ఎంత తిట్టుకున్నా.. మీరిద్దరూ జీవిత భాగస్వాములు.. కోపతాపాలు క్షణికాలు అని గుర్తుంచుకోవాలి. మీ కోసం భాగస్వామిపై కాకుండా వచ్చిన సమస్యపై ఉండాలని నిపుణులు అంటున్నారు.
Read Also: బాత్రూమ్‌లో మొబైల్ వాడితే పైల్స్ వస్తాయా..?
Follow Us on: Youtube

