దొంగలను, నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టే వృత్తిలో ఉన్న ఓ మహిళా అధికారే.. తన స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) భోపాల్‌లో కీలకంగా మారింది. డీఎస్పీ హోదాలో ఉన్న కల్పనా రఘువంశీ.. తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి రూ.2లక్షల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను చోరీచేసింది. ఆమె స్నేహితురాలు తన ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్నానం చేసిన వచ్చిన తర్వాత తన ఫోన్ కనిపించకుండా పోవడం, నగదు కూడా లేకపోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది.
వెంటనే సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా తన స్నేహితురాలు, డీఎస్పీ కల్పనా(Kalpana Raghuwanshi) వాటిని దొంగలించినట్లు గుర్తించింది. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తన స్నేహితురాలు కల్పనపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా రఘువంశీపై చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితురాలు ప్రస్తుతం పరారీలో ఉందని, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

