కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామం నక్షత్ర ఓపెన్ వెంచర్ ప్రాంతంలో ఈ నెల 15న జరిగిన మహిళ హత్య కేసును మధిర (Madhira) రూరల్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘోర హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను వైరా ఏసీపీ సారంగపాణి బుధవారం మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధం, ఆపై జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీసినట్లు విచారణలో తేలిందన్నారు.
మెడ చుట్టూ చున్నీ బిగించి క్రూరంగా హత్య..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి కల్పన (28) మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు లాగే మే 15న ఉదయం విధులకు వెళ్తున్నానని ఇంటి నుండి బయలుదేరింది. అయితే ఆమె ఆ రోజు కార్యాలయానికి హాజరు కాలేదని సహోద్యోగి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అదే రోజున యార్లగడ్డ చెన్నారావు అనే వ్యక్తి ‘మీ అక్క నా దగ్గర ఉంది, మాట్లాడుకోవాలి’ అంటూ కల్పన తమ్ముడు గోపిశెట్టి సాయిరామ్‌కు ఫోన్ సందేశం పంపాడు. దీనితో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చేపట్టగా, కృష్ణాపురం గ్రామ శివారులోని నక్షత్ర ఓపెన్ వెంచర్ ప్రాంతంలో కల్పన మృతదేహం లభ్యమైంది. ఆమె నోరు, మెడ చుట్టూ చున్నీ బిగించి క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు..
ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడైన యార్లగడ్డ అంకుశరావు అలియాస్ చెన్నారావు (30) (కనుమూరు గ్రామం, గంపలగూడెం మండలం) ను అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తులో భాగంగా మృతురాలితో నిందితుడికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు తేలిందని ఏసీపీ తెలిపారు. అలాగే మే 15వ తేదీన నిందితుడు కల్పనను తన ద్విచక్ర వాహనంపై కృష్ణాపురం సమీపంలోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లాడని, అక్కడ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో తమ సంబంధం గురించి అతని భార్యకు చెబుతానని కల్పన హెచ్చరించిందని, దీనితో కోపోద్రిక్తుడైన నిందితుడు ఆమె చున్నీతోనే మెడ బిగించి హతమార్చినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడన్నారు. ఈ క్రమంలో మే 20న అంబరుపేట వెంచర్ ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని, అనంతరం నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీపీ తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, వ్యక్తిగత సంబంధాల పేరుతో మోసపోయే పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిచయాలు, వ్యక్తిగత సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా బెదిరింపులు లేదా వేధింపులకు గురిచేస్తే వెంటనే కుటుంబ సభ్యులకు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలన్నారు. వివాదాలు తీవ్రరూపం దాల్చే పరిస్థితుల్లో ఏకాంత ప్రాంతాలకు వెళ్లడం వంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. మధు, మధిర రూరల్ ఎస్ఐ బి. లక్ష్మీ భార్గవి తదితరులు పాల్గొన్నారు.

