కలం, వెబ్‌డెస్క్: హిందూ సంప్రదాయం, సనాతన ధర్మంలో తులసి (Tulasi) మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భావించి ప్రతి ఇంటి ముంగిట పూజిస్తారు. ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉండటం, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే తులసిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు పండితులు.
హిందూ ఇళ్లల్లో తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. పూజ చేసినా తృప్తి దొరకడం లేదంటే దానికి కారణం మనం తులసి మొక్క దగ్గర తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లే కావచ్చని చెబుతున్నారు. పవిత్రత ఉన్న చోట అపవిత్రత చేరితే దైవకృప తగ్గుతుందని ధర్మశాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే తులసి పూజ చేసేటపుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇపుడు చూద్దాం.
తులసి కోట వద్ద చేయకూడని తప్పులు
తులసి కోట చుట్టుపక్కల ఎప్పుడూ చెప్పులు, పాత బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా విరిగిన వస్తువులు అస్సలు ఉంచకూడదట. ఇలాంటి నెగిటివ్ వస్తువులు ఉండటం వల్ల ఆ స్థలంలో పవిత్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. అలాగే, తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి యజమానిపై ఉందంటున్నారు. నిర్లక్ష్యం వల్ల తులసి మొక్క ఎండిపోతే.. ఇంట్లోని ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తోందనడానికి సంకేతమట. అందుకే అనునిత్యం తులసి మొక్కకు నీరు పోస్తూ పచ్చగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి వేళల్లో తులసి ఆకులను కోయకూడదు. ఆ సమయంలో దేవతా శక్తులు విశ్రాంతి తీసుకుంటాయని, అందుకే ఆ సమయంలో కోస్తే పరమ అపవిత్రమని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా తులసి కోట దగ్గర కూర్చుని ఏడవడం, బాధపడటం లేదా కోపంతో ఇతరులను తిట్టడం వంటివి అస్సలు చేయకూడదట. చాలా మంది ఫోన్లలో గొడవలు పడుతూ తులసి మొక్క చుట్టూ తిరుగుతుంటారు. తులసి అనేది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే కేంద్రం. అక్కడ మనం ప్రతికూల భావాలను వ్యక్తపరిస్తే ఇంట్లో ఆందోళన మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రార్థన చేసేటప్పుడు ‘నాకే ఎందుకు ఈ కష్టాలు’ అనే నిరాశతో కాకుండా, ‘భగవంతుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు’ అనే పూర్తి విశ్వాసంతో అడగాలట. ప్రతి శుక్రవారం సాయంత్రం తులసి కోట చుట్టూ శుభ్రం చేసి, లక్ష్మీ అష్టోత్తరం వింటూ ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించాలి. ఆ సమయంలో ఇంట్లో అందరూ కలిసి ప్రశాంతంగా, ప్రేమగా మాట్లాడాలి. హృదయ శుద్ధితో చేసే ఇటువంటి చిన్న మార్పులు మీ ఇంట్లోకి తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని, అపారమైన ప్రశాంతతను తీసుకువస్తాయని చెబుతున్నారు పండితులు.

